హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): నీట్ యూజీ మెడికల్ సీట్ల భర్తీలో ‘స్థానికత’ అంశం మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం వద్దకే చేరింది. కౌన్సెలింగ్లో తమకు కూడా అవకాశం ఇవ్వాలంటూ నాన్ పిటిషనర్లు వేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. సెప్టెంబర్ 20న తాము ఇచ్చిన ఉత్తర్వులను నాన్ పటిషనర్లకు కూడా వర్తింపజేయాలా? లేదా? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ ఉత్తర్వులను వారికి కూడా అమలు చేసిన పక్షంలో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలే తగిన నిబంధనలు రూపొందించాలని పేర్కొంటూ.. ఈ అంశంపై ఈ నెల 3న తమ తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని ప్రకటించింది.
మెడికల్ సీట్ల భర్తీలో స్థానికతను నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తొలుత హైకోర్టును ఆశ్రయించిన 135 మంది పిటిషనర్లకు ఈ ఏడాది కౌన్సెలింగ్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో తదనుగుణంగా సుప్రీంకోర్టు సెప్టెంబర్ 20న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులను తమకు కూడా వర్తింపజేయాలని, తమను కూడా స్థానికులుగా పరిగణించి కౌన్సెలింగ్కు హాజరయ్యే అవకాశాన్ని కల్పించాలని కోరుతూ నాన్ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండేండ్లు ఇతర రాష్ర్టాల్లో చదివిన కారణంగా తాము ఇటు తెలంగాణతోపాటు అటు ఇతర రాష్ర్టాల్లోనూ స్థానికేతరులుగా మారిపోయామని, తెలంగాణ బిడ్డలమైనప్పటికీ సొంత రాష్ట్రంలోనే తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరారు. దీంతో వారి విజ్ఞప్తిపై రాష్ట్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.