న్యూఢిల్లీ, నవంబర్ 25: దశాబ్దాలుగా ఇండ్ల స్థలాల కోసం వేచి చూస్తున్న హైదరాబాద్‌లోని పాత్రికేయుల ఆశలపై సుప్రీంకోర్టు నీళ్లు చల్లింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, బ్యూరోక్రాట్లు, న్యాయమూర్తులు, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సోమవారం కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు 64 పేజీలతో తుది తీర్పును వెలువరించింది. భూముల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఏకపక్షంగా, అహేతుకంగా, వివక్షాపూరితంగా ఉన్నాయని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు)ను ఉల్లంఘించడమేనని స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, జర్నలిస్టులకు డిస్కౌంట్ ధరల్లో స్థలాల కేటాయింపునకు వారిని ప్రత్యేక క్యాటగిరీగా పరిగణించలేమని పేర్కొంది.
ఈ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2005లో, 2008లో జారీచేసిన జీవోలను కొట్టివేస్తున్నట్టు తెలిపింది. ఈ తీర్పుతో హౌసింగ్ సొసైటీలు, వాటి సభ్యులతో ప్రభుత్వం చేసుకున్న లీజు ఒప్పందాలు కూడా రద్దయినట్టేనని ప్రకటించింది. సొసైటీలు, వాటి సభ్యులు చెల్లించిన రిజిస్ట్రేషన్ చార్జీలను, స్టాంప్ డ్యూటీలను, ఇతర ఖర్చులను వడ్డీతో సహా ప్రభుత్వం తిరిగి చెల్లించాలని తీర్పు చెప్పింది. సొసైటీల ఖాతాలో పేర్కొన్న డెవలప్మెంట్ చార్జీలను ఇన్‌కం ట్యాక్స్ విభాగం ధ్రువీకరణతో వడ్డీతో సహా చెల్లించాలని పేర్కొంది. రిజర్వు బ్యాంకు నిర్దేశించిన మేరకు వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది. ఆయా సొసైటీలకు కేటాయించిన సదరు భూమిని భవిష్యత్తులో ఎవరికి కేటాయించాలన్నది తెలంగాణ ప్రభుత్వం విచక్షణకే వదిలివేస్తున్నామని, అయితే ఆ కేటాయింపులు చట్టబద్ధంగా, సమానత్వ, న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉండాలని వివరించింది.
అక్రెడిటెడ్ జర్నలిస్టులకు ప్రత్యేక ప్రాధాన్యం పొందడానికి వారిని సమాజంలో ఓ ప్రత్యేక విభాగంగా పరిగణించలేమని అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వ విధానం సమానత్వ, న్యాయ ప్రమాణాలకు అనుగుణంగా లేదని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు లోబడి స్థలాల కేటాయింపు జరిగి ఉంటే సహేతుకంగా ఉండేదని స్పష్టం చేసింది. సమాజంలోని అణగారిన, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలతో పోలిస్తే న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మెరుగైన స్థితిలోనే ఉన్నారని వ్యాఖ్యానించింది.
ప్రభుత్వ వైఫల్యమే: టీయూడబ్ల్యూజేఎఫ్
ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం, తప్పుడు విధానాల కారణంగానే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బసవపున్నయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా న్యాయనిపుణులను సంప్రదించి భవిష్యత్తులో ఇటువంటి అడ్డంకులు రాకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టులకు న్యాయం జరిగేలా కృషి చేస్తాం: టీయూడబ్ల్యూజే
జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అత్యంత విచారకరమని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కే విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కే రాంనారాయణ, ఉప ప్రధానకార్యదర్శి కే రాములు పేర్కొన్నారు. జర్నలిస్టుల దీనమైన జీవన పరిస్థితులను మానవీయకోణంలో అర్థం చేసుకొని, గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి అనుకూలంగా తీర్పునిస్తే, దానిని కొట్టివేసి తీర్పు ఇవ్వడం దురదృష్టకరమని విచారం వ్యక్తంచేశారు.
ఈ తీర్పు దాదాపు వెయ్యి జర్నలిస్టు కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నదని తెలిపారు. ఏండ్ల తరబడి ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న వేల మంది ఆయా సొసైటీల జర్నలిస్టులను నిరుత్సాహానికి గురిచేస్తుందని పేర్కొన్నారు. ఇండ్ల స్థలాల కేటాయింపు విషయంలో ఆయా సొసైటీల బాధ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు సమాచార, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్ది దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుంచి జర్నలిస్టులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని వారు తెలిపారు.