బీఆర్ఎస్-బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చింది. ఆమె బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంపీ సీట్లు త్యాగం చేసింది నిజం. సిసోడియా, కేజ్రీవాల్‌కు రాని బెయిల్ ఐదు నెలల్లోనే కవితకు ఎలా వచ్చింది?
– బుధవారం చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
మేం రాజకీయ నాయకులను పట్టించుకోం. మా ఆదేశాలను ఎవరైనా విమర్శించినా ఇబ్బంది లేదు. మా మనస్సాక్షి ప్రకారం, మేము చేసిన ప్రమాణం ప్రకారం మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం.
– సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం
సీఎం వ్యాఖ్యలు అవాంఛనీయం. ఆయన తరఫున మేము క్షమాపణలు కోరుతున్నాం. ఆయనకు కౌన్సెలింగ్ ఇస్తాం. మరోసారి ఇలా జరుగకుండా చూసుకుంటాం.
– ధర్మాసనంతో రేవంత్ తరఫు న్యాయవాదులు
Supreme Court | హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును తప్పు పడ్తారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది. ‘కోర్టులంటే గౌరవం లేదా?’ అంటూ కన్నెర్రజేసింది. పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉం టుందని తీవ్రంగా హెచ్చరించింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ-బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందంటూ బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం మాట్లాడుతూ.. సిసోడియా, కేజ్రీవాల్‌కు రాని బెయిల్ ఐదు నెలల్లోనే కవితకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంపీ సీట్లను త్యాగం చేసిందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై గురువారం సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఓటుకు నోటు కేసు విచారణను వేరే రాష్ర్టానికి తరలించాలంటూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
సీఎం రేవంత్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఇది చాలా పాత కేసు అని, ఇప్పటివరకు 25 మంది సాక్షులను విచారించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ‘ఆయన (సీఎం రేవంత్‌రెడ్డి) నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ను ఈ రోజు పొద్దున పత్రికల్లో చదివాం. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా?’ అని ప్రశ్నించారు. ‘ఆయన ఏం అన్నారో ఓసారి చూడండి. మేము రాజకీయ పార్టీలను సంప్రదించి ఆదేశాలు ఇస్తామా?. ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా?’ అని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొందరి మనసుల్లో భయాందోళనలు కలిగించే అవకాశం ఉన్నదని అన్నారు.
‘మేం రాజకీయ నాయకులను పట్టించుకోం. మా ఆదేశాలను ఎవరైనా విమర్శించినా ఇబ్బంది లేదు. మా మనస్సాక్షి ప్రకారం, మేము చేసిన ప్రమాణం ప్రకారం మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం’ అని స్పష్టం చేశారు. జస్టిస్ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ‘ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలేనా ఇవి?. ప్రభుత్వం, న్యాయస్థానాల మధ్య పరస్పర గౌరవం ఉండాలన్న ప్రాథమిక నియమం కూడా తెలియదా?. వ్యవస్థల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా.. గౌరవం ఉండాలి కదా’ అని ప్రశ్నించారు. ‘ఇలాంటి ప్రవర్తన, ఇంత మొండి వైఖరి ఉంటే ఎలా?. కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల్లో మేము (కోర్టులు) జోక్యం చేసుకోబోమని ఎప్పుడూ చెప్తుంటాం. అంతే గౌరవాన్ని మేము వారి నుంచి కూడా ఆశిస్తాం’ అని జస్టిస్ గవాయి పేర్కొన్నారు.
ఈ ఒక్క కారణంతో కేసు విచారణను పిటిషనర్ కోరినట్టు మధ్యప్రదేశ్ హైకోర్టు బదిలీ చేయాలని ఆదేశాలు ఇవ్వొచ్చు అన్నారు. ‘సుప్రీంకోర్టు ఆదేశాలపై ధైర్యంగా వ్యాఖ్యలు చేయచ్చని అనుకుంటున్నారా. నిన్ననే ఒక అదనపు కార్యదర్శికి నోటీసులు ఇచ్చాం’ అని మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ అధికారికి కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం పట్ల ఆయనకు గౌరవం లేకపోతే.. వేరే రాష్ట్రంలో కేసు విచారణను ఎదుర్కోమనండి.. అని జస్టిస్ గవాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలో రేవంత్‌రెడ్డి తరపున న్యాయవాదులు స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు అవాంఛనీయమని, ఆయన తరఫున సుప్రీంకోర్టును క్షమాపణలు కోరారు. మరోసారి ఇలా జరుగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డికి కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు. సీఎం వ్యాఖ్యలపై ఎలాంటి నోటీసులు ఇవ్వవద్దని విజ్ఞప్తిచేశారు. వారి విజ్ఞప్తి మేరకు కేసు విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.
జగదీశ్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు అర్యమ సుందరం, దామ శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. ఓటుకు నోటు కేసులో నిందితుడు రేవంత్‌రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అని, హోం శాఖ సైతం ఆయన ఆధ్వర్యంలోనే ఉన్నదని చెప్పారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ నేరుగా ఆయనకే రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్ష్యులను, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను ఇప్పటివరకు ఎగ్జామిన్ చేయలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం తన వైఖరిని క్రమంగా మార్చుకుంటున్నట్టు కనిపిస్తున్నదని, రేవంత్ రెడ్డి ప్రత్యక్ష సాక్షులను ప్రభావితం చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో నిష్పక్షపాత విచారణ సాధ్యం కాదని, కాబట్టి విచారణను మధ్యప్రదేశ్ హైకోర్టుకు మార్చాలని కోరారు. లేదా పోలీసులు సీఎంకు రిపోర్ట్ చేయకుండా కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగినా అభ్యంతరం లేదని చెప్పారు.
‘మేం రాజకీయ పార్టీలను సంప్రదించి ఆదేశాలు ఇస్తామా? బాధ్యతగల ముఖ్యమంత్రి చేయదగిన ప్రకటనేనా ఇది? ఆయన మాటలు ప్రజల మనస్సుల్లో భయాందోళనలు రేకెత్తించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? మీ రాజకీయ శతృత్వంలోకి కోర్టులను ఎందుకు లాగుతారు? ప్రభుత్వం, న్యాయస్థానాల మధ్య పరస్పర గౌరవం ఉండాలన్న ప్రాథమిక నియమం కూడా తెలియదా? ఇంత మొండి వైఖరి ఉంటే ఎలా? దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమంటే గౌరవం లేదా?. ఇది న్యాయస్థానాల గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన అంశం’.
– సుప్రీంకోర్టు ధర్మాసనం