యాదాద్రి, నవంబర్ 5 : యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడికి సుప్రభాత సేవను అర్చకులు అత్యంత వైభవంగా జరిపారు. శనివారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచి స్థాన సుప్రభాతాన్ని వినిపించి స్వామివారిని మేల్కొలిపారు. స్వామి, అమ్మవార్లకు తిరువారాధన జరిపారు. స్వామి, అమ్మవార్లను పట్టువస్ర్తాలతో అలంకరించి గజవాహన సేవ నిర్వహించారు.
నిత్య తిరుకల్యాణోత్సవం జరిపారు. రాత్రి నివేదన చేపట్టిన అర్చకులు శయనోత్సవ సేవను నిర్వహించారు. రద్దీ కారణంగా స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. 35 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, ఖజానాకు రూ.38,57,330 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.