హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): నూతన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల పకడ్బందీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అదనపు కలెక్టర్ల వ్యవస్థ సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తుంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అదనపు కలెక్టర్లను నియమించి ప్రత్యేక అధికారాలు కల్పించారు. ఈ నిర్ణయం స్థానిక సంస్థల పురోగతికి దోహదపడుతున్నది. స్థానిక సంస్థల పనితీరు మెరుగుపడటంతో పాటు ప్రస్తుతం పల్లెప్రగతి, పట్టణ ప్రగతి విజయవంతంగా కొనసాగేందుకు ఉపయోగపడుతున్నది. సమస్యలను స్థానిక అధికారులతో కలిసి పరిష్కరిస్తుండటంతో సుపరిపాలన ప్రజలకు మరింత చేరువవుతున్నది. దేశంలోనే ఏ రాష్ట్రంలోని లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు జూనియర్ ఐఏఎస్‌లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను అదనపు కలెక్టర్లుగా నియమించింది. వీరు ప్రధానంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి, పనులు పరిశీలించి కలెక్టర్లకు, ప్రభుత్వానికి నివేదించటం, పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలను పకడ్బందీగా అమలు చేయటం ప్రధాన ఉద్దేశం. కిందిస్థాయి అధికారుల పనితీరుపై పర్యవేక్షణ, ప్రజాప్రతినిధులు చట్ట ప్రకారం పనిచేస్తున్నారా లేదా చూడటం ప్రధాన విధులు. స్థానిక సంస్థల కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలకు హాజరుకావడం, చట్టం ప్రకారం పనిచేయకుంటే ప్రజాప్రతినిధులు, కింది స్థాయి అధికారులపై చర్యలు తీసుకునే అధికారాన్ని ఇచ్చారు. స్థానిక సంస్థలపై పర్యవేక్షణలో భాగంగా అదనపు కలెక్టర్లు ప్రయాణించడానికి అవసరమైన వాహనాలను కూడా ముఖ్యమంత్రి ఇటీవలే అం దించారు. ప్రతి అదనపు కలెక్టర్ పరిధిలో రూ.25 లక్షల నిధులను కూడా అందుబాటులో ఉంచారు. వీళ్లు స్థానిక సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు.
ఇంతకన్నా సంతోషం ఏముంటుంది!
నేను 26 ఏండ్లు రెవెన్యూ సర్వీసులో చేశాను. కానీ అదనపు కలెక్టర్‌గా చేస్తున్న సంవత్సరంలో ఇచ్చిన సంతృప్తి, సంతోషం ఏనాడు దక్కలేదు. దేశంలో ఎక్కడా స్థానిక సంస్థలకు ప్రత్యేకంగా అదనపు కలెక్టర్లు లేరు. మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకొచ్చారు. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలను సమర్థంగా అమలు చేస్తున్నాం. మాకు నిధులు ఇచ్చారు. సౌకర్యాలు కల్పించారు. బాధ్యతలు అప్పగించారు. స్థానిక సంస్థల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. పల్లె, పట్టణ ప్రగతితో గ్రామాల్లో అనేక మార్పులు వచ్చాయి. నిత్యం ప్రజల్లో ఉండే ఉద్యోగం ఇది. ఇంతకంటే సంతోషం ఏముంటుంది. – కందూరి చంద్రారెడ్డి, అదనపు కలెక్టర్, నారాయణపేట జిల్లా