Nizamabad | హైదరాబాద్/ఖలీల్‌వాడి, జనవరి 11 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన శుక్రవారం రాత్రి ఫంక్షన్‌హాల్‌గా మారిపోయింది. సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ తన చాంబర్‌ను ఫంక్షన్‌హాల్‌గా మార్చేశారు. రంగురంగుల అలంకరణలు, బెలూన్లు, ధగధగ మెరిసే లైట్ల మధ్య అట్టహాసంగా తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. భారీ కేకు, బొకేలు, బహుమతులు, ఫొటో షూట్లు, వీడియోలు ఇలా ఫంక్షన్‌హాల్‌కు ఏమాత్రం తీసిపోకుండా చాంబర్లో వేడుకలు జరిగిపోయాయి. ‘యథారాజ.. తథా ప్రజ’ అన్నట్టు.. సిబ్బంది కూడా తమ ‘మేడమ్’ను ప్రసన్నం చేసుకునేందుకు చాంబర్‌ను అలంకరించడమే కాకుండా, శుభాకాంక్షలు చెప్పేందుకు క్యూ కట్టారు. మొత్తంగా కొన్ని గంటలపాటు సూపరింటెండెంట్ చాంబర్‌తోపాటు ఆ పరిసరాలన్నీ ఫంక్షన్ హాల్‌ను తలపించాయి.
ఓ వైపు వేడుకలు జరుగుతుండగా.. శుక్రవారం రాత్రి రెంజల్ మండలం కల్యాపూర్ గ్రామానికి చెందిన కేతావత్ బిద్యానాయక్ ఫిట్స్ వచ్చిన భార్యను తీసుకొని దవాఖానకు పరిగెత్తుకొని వచ్చారు. సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో స్ట్రెచ్చర్గానీ, వీల్చైర్గానీ లభించలేదు. దీంతో భార్యను భుజాలపై వేసుకొని లోపలికి వెళ్లాడు. లోపల డాక్టర్లుగానీ, సిబ్బందిగానీ ఎవరూ కనిపించలేదు. అందరూ ‘మేడమ్’ చాంబర్ వద్దనే ఉన్నారు. దవాఖానలోని ఏడు అంతస్తులు తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశారు. చివరికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణకు ఫిర్యాదు చేశారు.
ఆయన చొరవతో అర్ధరాత్రి తర్వాత వైద్యులు బాధితురాలిని చేర్చుకొని చికిత్స అందించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న ఇతర రోగులు సైతం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. అయితే బాధితుడు రోగిని భుజాన వేసుకుని దవాఖాన మొత్తం తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై వివరణ కోరేందుకు సూపరింటెండెంట్‌ను సంప్రదించగా ఆమె స్పందించలేదు. నిజామాబాద్ దవాఖాన ఫంక్షన్ హాల్‌గా మారడం ఇదే మొదటిసారి కాదని స్థానికులు చెప్తున్నారు. నిరుడు కూడా ఇదే స్థాయిలో వేడుకలు జరిగాయని, రంగురంగుల డెకరేషన్, స్పార్కిల్స్ గన్, కేక్ వంటివాటితో హంగామా చేశారని అంటున్నారు.
నిలోఫర్‌లోనూ..
హైదరాబాద్‌లోని నిలోఫర్ దవాఖానలోనూ ఇటీవల ఇలాంటి ఘటనలు జరిగాయి. వైద్యాధికారుల బర్త్‌డేలు అట్టహాసంగా నిర్వహించారు. కేకులు, బహుమతులతో హంగామా చేశారు. నిలోఫర్ దవాఖాన ఫొటోషూట్ కేంద్రంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఓ వైద్యాధికారి దవాఖాన మెయిన్ గేటు ముందే ప్రజాప్రతినిధుల ైస్టెల్లో ఫొటో షూటు చేయించుకున్నారు. దీనిని సోషల్ మీడియాలోనూ అప్లోడ్ చేశారు. ఈ విషయం తెలిసినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు.