Sunkishala Project | పెద్దఅడిశర్లపల్లి, ఆగష్టు 8: అతిత్వరగా జంటనగరాలకు నీరు అందించాలనే రేవంత్ సర్కారు తొందరపాటు నిర్ణయం.. ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టాన్ని తేవడమేకాకుండా సుంకిశాల నీటి తరలింపును మరో ఏడాది వాయిదా వేసేలా చేసింది. నల్లగొండ జిల్లాలోని సుంకిశాల నుంచి కోదండపురం వరకు పైపులైన్ పనులు పూర్తి కావడంతో రెండు నెలల్లో ట్రయల్ రన్ చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించగా.. అవి ఆదిలోనే విఫలమై, పంప్‌హౌస్ జల దిగ్బంధంలో చిక్కుకున్నది.
ఏఎమ్మార్పీ నుంచి కాకుండా జంటనగరాలకు సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి తాగునీరు అందించే పథకంలో భాగంగా పెద్దవూర మండల జయరాం తండా సుంకిశాల వద్ద రూ.2000 కోట్లతో పంప్‌హౌస్ పనులకు గత సంవత్సరం శ్రీకారం చుట్టారు. ఇక్కడి నుంచి కోదండపురం ప్లాంట్ వరకు మూడు పైపులైన్ల ద్వారా ఏఎమ్మార్పీతో సంబంధం లేకుండా నేరుగా సాగర్ నుంచే నీటిని తరలించేందుకు పనులు జరుగుతున్నాయి. పంప్‌హౌస్‌తోపాటు ఇన్‌టేక్ వెల్‌లో మూడు సొరంగ నిర్మాణపు పనులను ప్రారంభించారు.
సాగర్ బ్యాక్ వాటర్ నుంచి మూడు లెవల్స్ ద్వారా నీటిని తీసుకునేందుకు మూడు సొరంగాలు తవ్వారు. మధ్య సొరంగానికి గేట్‌ను అమర్చి రిటైనింగ్ వాల్ ఏర్పాటుచేశారు. లోపలి భాగంలో టన్నెల్ ఇన్‌లెట్‌ను తెరవడంతో నీటి ఉధృతికి టన్నెల్ గేట్‌తోపాటు రక్షణ గోడ కూడా కుప్పకూలాయి. బయటి ప్రపంచానికి తెలియకుండా వారంపాటు పంప్‌హౌస్ పనులు నిలిపి వేసి ప్రత్యామ్నాయ చర్యల దిశగా అధికారులు అడుగులు వేస్తున్నా సాధ్యపడలేదు. బుధవారం జలమండలి సీజీఎం, డీఎం, డీజీఎం ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై కోదండపురం అతిథి గృహంలో చర్చించారు.ప్రస్తుతం పంప్‌హౌస్‌లో నీటిని తరలించే పరిస్థితి లేకపోవడంతో టన్నెల్‌కు పైభాగంలోనే పనులు చేయాల్సిన దుస్థితి వచ్చింది.