కేసీ కెనాల్ (కర్నూలు- కడప)కు కేటాయింపుల మేరకు నీరందడం లేదని, అందుకే గుండ్రేవుల రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ చెప్తున్నది. కానీ, వాస్తవంగా కేటాయింపులకు రెట్టింపు స్థాయిలో నీటిని కేసీ కెనాల్‌కు తరలిస్తున్నది. తుంగభద్ర జలాలనే కాదు; ట్రిబ్యునల్ అవార్డులకు విరుద్ధంగా మల్యాల, ముచ్చమర్రి, నిప్పులవాగు నుంచి కృష్ణా జలాలను కేసీ కెనాల్‌కే కొల్లగొడుతున్నది. కృష్ణా జలాలను మరింతగా కొల్లగొట్టేందుకే గుండ్రేవులకు శ్రీకారం చుడుతున్నదనేది స్పష్టంగా తెలిసిపోతున్నది. ఆంధ్రప్రదేశ్ తరహాలోనే కర్ణాటక సర్కార్ సైతం పూడిక పేరిట నావలి విస్తరణకు పూనుకొంటున్నది. కేవలం అదనపు ప్రాజెక్టుల నిర్మాణానికే పూడిక అంటూ గగ్గోలు పెడుతున్నాయనేది స్పష్టంగా తెలిసిపోతున్నది. వాస్తవాలు తెలిసీ వారికి రేవంత్ సర్కార్ వత్తాసు పలుకడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల బరాజ్ నుంచి కర్నూలు-కడప జిల్లాలకు నీటిని తరలించేందుకు నిర్మించినదే కేసీ కెనాలే. సుమారు 306 కిలోమీటర్ల పొడవైన ఆ కాలువ ద్వారానే కృష్ణా జలాలు యథేచ్ఛగా బేసిన్ అవతలికి తరలిపోతున్నాయి. 1944లో మద్రాస్, హైదరాబాద్ స్టేట్ ఒప్పందం ప్రకారం కేసీ కెనాల్ ద్వారా 10 టీఎంసీలను మాత్రమే వినియోగించుకోవాలి. అయితే, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తరువాత ఉమ్మడి పాలకులు ఆ ఒప్పందాన్ని తుంగలో తొక్కారు. ఆ తరువాత చారిత్రక రక్షణల పేరిట వాదనలు వినిపించి బచావత్ ట్రిబ్యునల్-1 కేసీ కెనాల్‌కు 39.90 టీఎంసీలను కేటాయించింది. ఆ మొత్తం జలాల్లో 10 టీఎంసీలను తుంగభద్ర డ్యామ్ నుంచి, మిగిలిన 29.90 టీఎంసీలను డ్యామ్ దిగువన, సుంకేసుల బరాజ్ మధ్య ఉన్న క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చే జలాలను వినియోగించుకోవాల్సి ఉంటుంది. 2004లో కేసీ కెనాల్ ఆధునీకరణ ద్వారా 8 టీఎంసీలు ఆదా అవుతున్నాయని చెప్పి, ఆ జలాలను ఎస్ఆర్బీసీకి (శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్) ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర నేతలు కేటాయించుకొన్నారు.
ఆ 8 టీఎంసీలను మినహాయిస్తే, కేసీ కెనాల్ ద్వారా తరలించాల్సిన జలాలు ప్రస్తుతం కేవలం 31.90 టీంఎంలే. కానీ, అంతకు రెట్టింపు స్థాయిలో ఏటా ఏపీ కృష్ణా జలాలను అక్రమ మార్గంలో మళ్లిస్తున్నది. అంతేకాకుండా, ట్రిబ్యునల్-1 కేటాయింపులను యథాప్రకారం కొనసాగించాలని ట్రిబ్యునల్-2 ఎదుట గతంలో ఏపీ ఎంత పట్టుబట్టినా, అక్కడ ఆ రాష్ట్రం పప్పులు ఉడకలేదు. బేసిన్ అవతలికి కృష్ణా జలాలను తరలింపును ఆమోదించేదీ లేదని ట్రిబ్యునల్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. ఆ పరిస్థితిని ముందునుంచే పసిగడుతూ వచ్చిన సీమాంధ్ర నేతలు కేసీ కెనాల్ ద్వారా జలదోపిడీకి తెరతీశారు. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌పై అక్రమంగా అదనపు ప్రాజెక్టులను నిర్మించడంతోపాటు, వాటిని విడతల వారీగా విస్తరించుకుంటూ కృష్ణా జలాలను పెన్నాకు తరలిస్తూ వస్తున్నారు.
చెన్నై తాగునీటి కోసం ఉద్దేశించిన 15 టీఎంసీలను, ఎస్ఆర్బీసీ (శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్) స్కీమ్‌కు సంబంధించి 19 టీఎంసీలను తరలించేందుకు మాత్రమే పోతిరెడ్డిపాడు దిగువన బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీని నిర్మించాల్సి ఉన్నది. అయితే, నాటి సీమాంధ్ర నేతలు ఇక్కడినుంచే కేసీ కెనాల్‌కు అక్రమంగా కృష్ణా జలాలను మళ్లించడం మొదలుపెట్టారు. సీమాంధ్ర పాలకులు 2006 నాటికి మరింత తెగబడ్డారు. జలయజ్ఞంలో భాగంగా బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీ నుంచే గాలేరు-నగరీ సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్) స్కీమ్‌కు, మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) స్కీమ్‌ను తెరమీదికి తీసుకొచ్చారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీకి నీటిని మళ్లించే కుట్రలో భాగంగా ముచ్చుమర్రి లిఫ్ట్‌ను రూపొందించారు.
అయితే, ఆచరణలో హెచ్ఎన్ఎస్ఎస్, ముచ్చుమర్రి లిఫ్ట్‌ల ద్వారా కేసీ కెనాల్‌కు సైతం కృష్ణా జలాలను మళ్లిస్తుండటం గమనార్హం. కేటాయింపులకు మించి కేసీ కెనాల్‌కు అటు తుంగభద్ర, ఇటు కృష్ణా జలాలను తరలిస్తున్న ఏపీనే ఇప్పుడు నీటికొరతంటూ బుకాయిస్తున్నది. దానిని సాకుగా చూపుతూ తుంగభద్రపై 20 టీంఎసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించేందుకు శరవేగంగా పా వులు కదుపుతున్నది. అయినప్పటికీ, రేవంత్‌రెడ్డి సర్కార్ వత్తాసు పలుకడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదీగాక ట్రిబ్యునల్‌లో కేసీ కెనాల్ నీటి కేటాయింపులపై పునఃసమీక్ష చేయాలని కోరుతూ, అందుకు విరుద్ధంగా గుండ్రేవుల రిజర్వాయర్‌కు అనుమతులిచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవడం గమనార్హం. మరోవైపు ఆర్డీఎస్కు కేటాయించిన 15.90 టీఎంసీలకుగాను కనీసం 5 టీఎంసీలు కూడా తెలంగాణకు అందని దుస్థితి. ఏపీ అక్రమ తరలింపు వల్ల హైదరాబాద్ తాగునీటి అవసరాలకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఏపీ తరహాలోనే కర్ణాటక సర్కార్ కూడా వ్యవహరిస్తున్నది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 230 టీఎంసీల నీటిని వినియోగించుకొనే లక్ష్యంతో తుంగభద్ర డ్యామ్‌ను నిర్మించారు. వాస్తవంగా డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 133 టీఎంసీలు. డ్యామ్‌ను మొదటిసారిగా 1953లో పూర్తిస్థాయిలో నింపారు. తదుపరి 2001, 2009 సర్వే ప్రకారం డ్యామ్ నీటినిల్వ సామర్థ్యం 28 టీఎంసీలను కోల్పోయిందని కర్ణాటక చెప్తున్నది. నీటి నిల్వ సామర్థ్యం కోల్పోవడంతో ప్రస్తుతం 174.72 టీఎంసీలను కూడా వినియోగించుకోలేని పరిస్థితి ఉన్నదని గగ్గోలు పెడుతున్నది. పూడిక సాకుతో డ్యామ్‌కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నావలి రిజర్వాయర్‌ను 31 టీఎంసీల నుంచి 52 టీఎంసీలకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించింది.