గంగాధర, మే 9: జగిత్యాల జిల్లా గంగాధరలో పోలీసులు ఓవర్ యాక్షన్ చూపించారు. కరీంనగర్ బంద్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యేను మార్గమధ్యలో అదుపులోకి తీసుకున్నారు. గంగాధర మండలం బూరుగుపల్లిలోని ఆయన నివాసానికి తీసుకొచ్చి హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రజాపాలన నడవడం లేదని ప్రజా అణిచితేవత పాలన నడుస్తోందని సుంకె రవిశంకర్ దుయ్యబట్టారు. తెలంగాణలో రాజ్యాంగం అమలులో లేదని.. రేవంత్ రెడ్డి సొంత రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు. దాడికి గురైన వారు నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. పుట్టుక గురించి మాట్లాడిన నాయకులు దర్జాగా బయట తిరుగుతుంటే.. దాడికి నిరసన తెలపడానికి వెళ్తున్న వారిని మాత్రం అక్రమ అరెస్టులు చేస్తారా అని నిలదీశారు.పరిపాలన చేతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీనామా చేసి కూర్చోవాలని హితవు పలికారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేరని.. అక్రమ అరెస్టులతో బంద్‌ను ఆపలేరని స్పష్టం చేశారు. దుర్మార్గమైన పరిపాలన ఎక్కువ రోజులు సాగదని అన్నారు.