గంగాధర, మార్చి 13: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేయాలని గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. చొప్పదండి సీఐ ప్రకాశ్‌గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి గంగాధర పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మధురానగర్ చౌరస్తాలో బస్సుల కోసం వేచి చూస్తున్న సాధారణ ప్రజలపై పోలీసులు బెదిరింపులకు దిగారు. ‘ఎకడికి వెళ్తున్నారు? ఇకడ ఏం చేస్తున్నారు?, గుర్తింపు కార్డు చూపించండి’ అంటూ భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో వారు నాయకులెవరో, సాధారణ ప్రజలు ఎవరో తెలియదా? అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బూరుగుపల్లి నుంచి రైతు ధర్నాకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.