హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో గ్రామాలకు నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. శనివారం అసెంబ్లీలో పంచాయతీరాజ్‌శాఖ పద్దుల సందర్భంగా జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం విడుదల చేసిన రూ.599 కోట్లు పంచాయతీ కార్మికులు, సిబ్బంది జీతాలకే వెళ్లాయని, గ్రామాల అభివృద్ధికి నిధులు ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. 99 రోజుల ప్రణాళికలోనూ నిధులు కేటాయించకపోగా, పంచాయతీ సిబ్బంది సొంత నిధులతో ప్రణాళికను విజయవంతం చేయాలని ఆదేశాలివ్వడం దారుణమని మండిపడ్డారు.
ఇందిరా మహిళాశక్తికి గతంలో రూ.110 కోట్లు కేటాయించినా రూపాయి ఖర్చు చేయలేదని ఆరోపించారు. ఈ బడ్జెట్లో మళ్లీ రూ.110 కోట్లు కేటాయించారని, ఈ నిధులతోనైనా పట్టణాల్లో భవనాలు పూర్తి చేయాలని కోరారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 20 రోజుల పనిదినాలు తొలగించి, పూర్తిస్థాయిలో 5.14 లక్షల మందికి పని కల్పించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో నేటికీ ఒక్క కొత్త పింఛనూ ఇవ్వలేదని సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. భర్త చనిపోతే భార్యకు వితంతు పింఛన్ కింద కన్వర్ట్ చేస్తున్నారే తప్ప, కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. దివ్యాంగుల సర్టిఫికెట్లు రెన్యువల్ చేయించకుండా ఉన్న పింఛన్లు తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్యాణలక్ష్మి, షాదీమూబారక్ నిలిచిపోయాయని, అర్హులైన లబ్ధిదారులకు పెండ్లిళ్లు అయ్యి, పిల్లలు పుట్టి, వారి బర్త్‌డేలు జరుగుతున్నా ఆ చెక్కులు అందకపోవడం దారుణమన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యేలతో కాకుండా ఇన్చార్జి మంత్రులు, ఓడిన అభ్యర్థులతో ఇప్పిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలుచేయనందుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ తరఫున సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు సునీతాలక్ష్మారెడ్డి ప్రకటించారు.