నాంపల్లి కోర్టులు, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): కూకట్పల్లి బార్ అసోసియేషన్‌లో పనిచేస్తున్న కే సంతోష్ అనే న్యాయవాదిపై పోలీసులు దాడిచేసి, అమానుషంగా అరెస్టు చేయడంపై మీడియాలో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటో వ్యాజ్యంగా స్వీకరించింది. ఈ ఘటనపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం సోమవారం పోలీసుల నుంచి నివేదిక తెప్పించుకుని, విచారణ చేపట్టింది. ఆ నివేదికలోని వివరాలను పరిశీలించిన ధర్మాసనం.. పోలీస్ అధికారులపై రిట్ పిటిషన్ వేసుకోవాలని సంతోష్‌కు సూచించింది. ఈ నెల 16న బోరబండ పోలీసులు సంతోష్ ఇంటికి వెళ్లి, కర్కశంగా వ్యవహరించారు. ఇంటి తలుపులు తెరవలేదన్న నెపంతో ఆయనను లుంగీ, బనియన్పైనే పోలీస్ వాహనంలో స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. దీనిపై సోమవారం రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్ల సమాఖ్య పిలుపు మేరకు నాంపల్లి కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, సంతోష్ పట్ల అమానుషంగా ప్రవర్తించిన పోలీస్ అధికారులను విధుల నుంచి తొలగించాలని నినదించారు. రాజ్యవర్ధన్రెడ్డి, శ్రీనాథ్, రామాంజనేయులు పాల్గొన్నారు.
కాళేశ్వరం కమిషన్‌కు విజిలెన్స్ మధ్యంతర నివేదిక
హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టిన కమిషన్‌కు విజిలెన్స్ డిపార్ట్మెంట్ తాజాగా మధ్యంతర నివేదికను అందజేసినట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌లో పిల్లర్ల కుంగుబాటు ఘటనపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం విజిలెన్స్ డిపార్ట్మెంట్ను ఆదేశించిన విషయం తెలిసిందే. విజిలెన్స్ విభాగం సైతం విచారణ చేపట్టి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందించింది. పూర్తిస్థాయి నివేదికను వెంటనే అందించాలని జస్టిస్ ఘోష్ కమిషన్ ఆదేశించటంతో.. మధ్యంతర నివేదికను కమిషన్‌కు అందించినట్టు తెలిసింది.
డెంగ్యూతో ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర మంత్రి ఓరం
న్యూఢిల్లీ, ఆగస్టు 19: డెంగ్యూతో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువాల్ ఓరం సోమవారం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని తెలిపాయి. జువాల్ ఓరం భార్య జింగియా(58) డెంగ్యూతో ఒడిశాలో భుశనేశ్వర్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు.