హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 28 (నమస్తే తెలంగాణ) : నాలుగో సింహం ఒకవైపే చూస్తున్నదా? మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో పోలీసుల చూపు కేవలం అతడిపైనే ఉన్నది. ఎంతసేపూ సుమంత్, అతడితో ఉన్న ఇతరులను అరెస్ట్ చేస్తామని చెప్తున్నారే తప్ప అసలు జరిగిన వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేయడం లేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. జరిగింది ఒకటైతే పోలీసులు చేస్తున్నది మరొకటి అంటూ ఈ వ్యవహారం మొత్తం తెలిసినవారు సన్నిహితుల వద్ద చెవులుకొరుక్కుంటున్నారు. గత నెల 30న తనపై సుమంత్ మరికొందరితో కలిసి దాడి చేశారంటూ ఈ నెల 20న మేడిపల్లి పీఎస్‌లో గొంగిడి హరికృష్ణ చేసిన ఫిర్యాదులో తనతో పాటు ఉన్నారంటూ చెప్పిన ఆ కిరణ్ ఎవరు అనే విషయంపై ప్రస్తుతం చర్చ జరుగుతున్నది. అసలు ఈ మొత్తం వ్యవహారం ఎక్కడ మొదలైంది? అసలు దీని వెనుక ఎవరున్నారు? అనేది నిశితంగా పరిశీలిస్తే సుమంత్ వ్యవహారం కూడా భూదందా చుట్టే తిరుగుతున్నది.
అటవీ భూములకు ఎన్వోసీలు ఇప్పిస్తాననడం, వివాదాస్పద భూముల వ్యవహారాలు గట్టెక్కిస్తానని చెప్పి తమ రాజకీయ పలుకుబడితో అధికారులు, అన్ని వర్గాలను మభ్యపెడుతున్న తీరు ఈ కేసులో స్పష్టంగా వెలుగుచూస్తున్నది. సుమారు పదిహేను గంటల పాటు అంటే ఒకరాత్రి నుంచి తెల్లవారి మధ్యాహ్నం వరకు పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్న ఒక వ్యక్తికి సంబంధించిన ఆధారాలు తమకు తెలిసినా బయటకు రానీయకుండా ఈ కేసు వెనుక ఉండి నడిపిస్తున్న వ్యక్తి ఎవరనేది కూడా రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. జూలై 30న సుమంత్ తనపై దాడి చేశారంటున్న హరికృష్ణ ఇంత ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేశారనేదానిపై ఆయన చెప్తున్న కారణాలు విచిత్రంగా ఉన్నా.. అసలు ఫిర్యాదు చేసే సమయంలో తనతో పాటు వచ్చిన కిరణ్‌కు, ఈ కేసుకు ఏం సంబంధమంటూ వారి వ్యతిరేకవర్గం ఆరా తీసింది. సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహిత కోటరీలో వ్యక్తిగా, గతంలో రేవంత్ పీఏగా పనిచేసి ఆ తర్వాత రేవంత్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకొనే అతి సన్నిహిత వర్గాల్లో ఒకరుగా ఉంటున్న కిరణ్‌కు, హరికృష్ణకు ఏం సంబంధమంటే అది వారే చెప్పాలంటూ పోలీసుల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ కేసు వ్యవహారంలోనే జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ సస్పెన్షన్ వ్యవహారంపై దృష్టి మరల్చడంలో భాగమేనంటూ కమిషనరేట్‌లో మాట్లాడుకుంటున్నారు. పీఎస్‌లో 15 గంటలు హరికృష్ణ ఉంటే ఆ సీసీ ఫుటేజీ బయటపెట్టకపోవడానికి కారణాలు, అసలు సుమంత్‌ను సముదాయించిన అధికారులెవరనే దిశగా పోలీసు వర్గాల్లో హాట్‌హాట్‌గా చర్చ జరుగుతున్నది. ఈగొడవకు పదికోట్లకు పైగా వసూళ్లే కారణమని, అవి కూడా మంత్రి కొండా, సుమంత్ పేరు చెప్పి అటవీ భూములకు ఎన్వోసీలు ఇవ్వడం, ఇతర వ్యవహారాలేనని పొలిటికల్ సర్కిల్లో చర్చ. అసలు జరిగింది ఒకటైతే, జరుగుతున్నది మరొకటని, ఈ విషయంలో హరికృష్ణ వసూళ్లను పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని, ఎలాంటి చర్యలు తీసుకోకుండా ముఖ్యనేత ఆంతరంగికుడుగా ఉన్న నాటి పీఏ, నేడు కోటరీలో కీలకవ్యక్తి తెరవెనుక ప్రత్యేక వ్యవహారం నడుపుతున్నట్టు తెలిసింది.
హరికృష్ణపై దాడి వ్యవహారంలో సుమంత్ అంత సీరియస్ కావడానికి కారణం ఒక్క మధుసూదన్‌రెడ్డి కేసు మాత్రమే కాకుండా ఇతరులకు సంబంధించిన సుమారు పదికోట్ల లావాదేవీలు ఉన్నాయని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇవన్నీ భూదందాలేనని, ప్రస్తు తం ఉన్న 22ఏ వ్యవహారాలూ తాము సెటిల్ చేస్తామంటూ ఈగ్యాంగ్ చాలామందిని మభ్యపెట్టినట్టుగా తెలిసినా సుమంత్ టార్గెట్‌గా జరుగుతున్న ఈ వ్యవహారంలో కొత్త కోణాలు వెతుకవద్దంటూ ముఖ్యనేత సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. ముఖ్యం గా ఇందులో మంత్రి కొండా సురేఖకు తెలియకుండా, సుమంత్‌కు సంబంధం లేకుండా వారి పేర్లు వాడి తన సొంత జిల్లా అయిన జనగామలో రెండు భూములకు ఎన్వోసీలు, ఒక నేతకు చెందిన భూవ్యవహారం తేలుస్తానం టూ కోట్లు వసూలు చేయడంతోపాటు భూపాలపల్లిలో ఒక భూమి ఎన్వోసీకి డబ్బు తీసుకున్నారని.. ఇలా పెద్ద లిస్టే అవుతుందని పోలీసులే ఆఫ్ ది రికార్డుగా చెప్తున్నారు.
30న ఘటన జరిగిన తర్వాత హరికృష్ణను జూబ్లీహిల్స్ పీఎస్‌కు తన మనుషులతో సుమంత్ పంపాడని, ఆ తర్వాత అతడిపై ఫిర్యాదు చేయడానికి తెల్లవారి సుమంత్ వ్యక్తులు వచ్చినప్పుడు ఇదంతా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటూ ఖాకీ ముఖ్యులు సముదాయించడంతో పాటు బాధితులతో కేసు పెట్టించాలంటూ సుమంత్‌కు సూచించడంతో ఆయన ఎలాంటి కేసూ పెట్టకుండా బాధితులతో కేసులు పెట్టాలని చెప్పినట్టు తెలిసింది. దీంతో ఈ నెల 2న మాదాపూర్ పీఎస్‌లో ముత్యాల మనోహర్‌రెడ్డి అనే వ్యక్తి తాను అనుమహ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీనంటూ తనను గొంగిడి హరికృష్ణ రూ.1.80 కోట్లు మోసం చేశారని ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన పిటిషన్ ఐడీ నంబర్ CYB/ MDPR_CYB/040826/05414 గా నమోదైనట్టు మెసేజ్ వచ్చింది.
ఈ ఫిర్యాదులో గొంగిడి హరికృష్ణ తనకు అధికారులు, రాజకీయనాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పి నమ్మించి కూకట్పల్లి నిజాంపేటలోని 5 ఎకరాల భూమికి సంబంధించిన మ్యుటేషన్, సక్సెషన్ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. తాము హరికృష్ణను నమ్మి అనుమహ్ ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి గొంగిడి హరికృ ష్ణ, ఆయన చెప్పిన మరో వ్యక్తి సుర్కంటి రఘువీరారెడ్డికి రూ.1,80,00,217.70 పంపించినట్టు ఫిర్యాదులో వివరాలు సహా పేర్కొన్నారు. పనుల గురించి అడిగితే తమ ను చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదులో తెలిపారు. మాదాపూర్‌లో ఇచ్చిన ఈ ఫిర్యాదుపై నెల గడిచినా ఎలాంటి సమాచారమూ లేదు. ఈలోగా కొండా సుస్మిత వ్యాఖ్యల తర్వాత హరికృష్ణతో ఫిర్యాదు చేయించినట్టు అధికారపార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.