Suicide : ఉద్యోగం రాదేమోనన్న ఆందోళనతో అమెరికా (USA) లో కర్నూలు యువకుడు చందు (Chandu) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపుతోంది. 26 ఏళ్ల వయసులో ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళిన యువకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరి హృదయాలను కలచివేస్తోంది. కాగా కర్నూలుకు చెందిన ఇరగనబోయిన చందు షికాగోలోని డీపాల్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశాడు. ప్రస్తుతం అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ 2.0 (Donald Trump 2.0) ప్రభుత్వంలో నెలకొన్న పరిస్థితులు, హెచ్-1బి వీసా నిబంధనల మార్పుల వల్ల కొత్తగా చదువు పూర్తిచేసిన వారికి ఉద్యోగాలు రావడం సవాలుగా మారింది.
చందు కూడా గత కొంతకాలంగా ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. తన ఖర్చుల కోసం మళ్ళీ తల్లిదండ్రులపైనే ఆధారపడాల్సి వస్తోందన్న భావన అతనిని మరింత కుంగదీసింది. ఆ ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తుపై నెలకొన్న ఆందోళన తట్టుకోలేక ఏప్రిల్ 28న తన గదిలోనే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చందు మరణవార్తతో అతని స్వస్థలం కర్నూలులో విషాద ఛాయలు అలుముకున్నాయి. తానా టీమ్ స్క్వేర్ కో-చైర్ చిరంజీవి గల్లా, ఇతర ప్రవాస తెలుగు సంఘాలు చందు మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇండియాకు పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.