రాయపోల్ మే 1 : పంటల మార్పిడి తప్పకుండా చేయాలి. యూరియా వాడకాన్ని తగ్గించాలి అని డా. సి.హెచ్.పల్లవి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్వర్యంలో మెరుగైన సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు, వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని రైతువేదికలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సిద్దిపేట, వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నల వారి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు సోదరులకు ఆరు అంశాలపై అవగాహన కల్పించామన్నారు. ముఖ్యంగా ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా వాడకాన్ని తగ్గించడం ద్వారా సాగు ఖర్చు తగ్గించు కోవచ్చునని, రసాయనాలను అవసరం మేరకు వినియోగించి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడడం, పంట మార్పిడి పాటించడం ద్వారా స్థిర ఆదాయం పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో డా. డి.శ్వేత, నరేష్, హార్టికల్చర్ ఆఫీసర్ రమేష్, వ్యవసాయ విస్తరణ అధికారిని రజిత, స్వర్ణలత, ప్రవీణ్, సర్పంచ్ మాసంపల్లి రాజు, దిశా కమిటీ సభ్యుడు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.