Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్లో తెరకెక్కుతున్న పెద్దిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంతో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా గురించి మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో ఒక స్పెషల్ మాస్ సాంగ్ కోసం గ్లామర్ స్టార్ శృతి హాసన్‌ని ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ పాట కోసం ఆమె తీసుకుంటున్న పారితోషికం మరింత సంచలనంగా మారింది. సాధారణంగా హీరోయిన్గా చేస్తే ఆమె దాదాపు రూ.3 కోట్ల లోపు రెమ్యునరేషన్ తీసుకుంటారని తెలిసినా, ‘పెద్ది’లో కేవలం ఒకే ఒక్క పాట కోసం రూ.3.5 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ టాక్.
హీరోయిన్గా ఒక సినిమాకు నెల రోజుల వరకు కాల్షీట్లు ఇవ్వాల్సి ఉండగా, స్పెషల్ సాంగ్ కోసం కేవలం 4–5 రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ రెమ్యునరేషన్ అందుకోవడం వల్ల ఇది శృతి హాసన్‌కు ‘బంపర్ ఆఫర్’గా భావిస్తున్నారు సినీ విశ్లేషకులు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గతంలో రామ్ చరణ్ – శృతి హాసన్ కలిసి నటించిన ఎవడు బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. అదే సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ పాట కోసం చరణ్ స్వయంగా శృతిని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. చరణ్ ఎనర్జిటిక్ డ్యాన్స్‌కు శృతి హాసన్ గ్లామర్ తోడైతే ఈ పాట థియేటర్లలో హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
ఈ స్పెషల్ సాంగ్‌కు సంగీతాన్ని ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారని సమాచారం. ఉత్తరాంధ్ర యాసలో సాగే పక్కా మాస్ నంబర్‌గా ఈ పాట రూపొందుతోందని తెలుస్తోంది. హైదరాబాద్ సమీపంలోని జన్వాడలో వేసిన భారీ సెట్లో ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ జరుగుతోందని టాక్. గతంలో తమన్నా భాటియా, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ కోసం భారీ పారితోషికాలు తీసుకున్నారు. ఇప్పుడు శృతి హాసన్ వారిని మించి టాలీవుడ్లో అత్యంత ఖరీదైన స్పెషల్ సాంగ్ చేసిన నటిగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ సినిమా జూన్‌లో విడుదలకు సిద్ధమవుతోందని సమాచారం. ఒకే పాటతో ఇంతటి చర్చ జరగడం ‘పెద్ది’ సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా భావిస్తున్నారు సినీ వర్గాలు.