Singer Abhijeet | బాలీవుడ్లో ఒకప్పుడు హిట్ కాంబినేషన్‌గా నిలిచిన షారుఖ్ ఖాన్ – అభిజీత్ భట్టాచార్య మధ్య విభేదాలపై తాజాగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1990వ దశకంలో షారుఖ్ సినిమాల్లోని అనేక పాటలకు అభిజీత్ గాత్రం ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. షారుఖ్ స్క్రీన్ ఇమేజ్‌కు ఆయన గొంతు పర్ఫెక్ట్గా సరిపోవడంతో ఈ కాంబినేషన్ అభిమానుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరి మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అభిజీత్, ఈ విభేదాలపై మాట్లాడారు. “మా మధ్య వచ్చిన చీలికకు ప్రధాన కారణం షారుఖ్ ఇగో, నా ఆత్మగౌరవం” అంటూ స్పష్టం చేశారు.
ఇతర నటులతో పోల్చుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. ఆమిర్ ఖాన్‌తో జరిగిన వివాదాల తర్వాత కూడా షారుఖ్ మళ్లీ సర్దుకుపోయారని, అలాగే ఫరా ఖాన్ కుటుంబంతో జరిగిన విభేదాల అనంతరం కూడా ఆయన సంబంధాలను మెరుగుపరుచుకున్నారని తెలిపారు. కానీ తన విషయంలో మాత్రం కనీసం ఒక “సారీ” కూడా చెప్పలేదని అభిజీత్ వాపోయారు. గతంలో మై హూ నా సినిమా సమయంలో ప్లేబ్యాక్ సింగర్లకు సరైన గుర్తింపు ఇవ్వలేదని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ఎండ్ క్రెడిట్స్‌లో తమ పేర్లు లేకపోవడం తనను తీవ్రంగా బాధించిందని, అదే తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని తెలిపారు. ఒక చిన్న తప్పు జరిగినా క్షమాపణ చెప్పాలి. గుర్తింపు లేకపోవడం వల్లనే ఆయన సినిమాలకు పాడటం ఆపేశాను అని స్పష్టం చేశారు.
తాను షారుఖ్ పేరును పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నాననే ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. తన గొంతు వల్లే షారుఖ్ కెరీర్లో ఎన్నో హిట్ పాటలు వచ్చాయని, తనకు ప్రత్యేక ప్రచారం అవసరం లేదని ధీమాగా చెప్పారు. ప్రస్తుతం షారుఖ్‌తో కేవలం బహిరంగ కార్యక్రమాల్లో మాత్రమే పలకరింపులు జరుగుతున్నాయని, వ్యక్తిగతంగా సంబంధాలు లేవని పేర్కొన్నారు. అయితే భవిష్యత్తులో పరిస్థితులు మారితే మళ్లీ కలిసి పనిచేసే అవకాశం ఉందని సూచించారు.ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘బాద్షా’, ‘యెస్ బాస్’, ‘చల్తే చల్తే’ వంటి చిత్రాల పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీన్ హిట్స్‌గా నిలిచాయి. దీంతో అభిమానులు మళ్లీ ఈ హిట్ జంట కలిసే రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.