పెద్దవూర/ఆత్మకూరు/భూత్పూర్, ఆగస్టు 12: అప్పుల బాధలు భరించలేక రాష్ట్రంలో సోమవారం ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో ఒకరు నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి తండాకు, మరొకరు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటకు చెందిన వారు ఉన్నారు. చింతపల్లి తండాకు చెందిన జటావత్ కృష్ణ (40) 5 ఎకరాలతోపాటు మరో మూడెకరాల భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పంటలను కాపాడుకునేందుకు ఇటీవల 8 బోర్లు వేయగా చుక్కనీరు పడలేదు. గతంలో పంట పెట్టుబడి కోసం రూ.10 లక్షల అప్పు చేశాడు. అవి తీరకపోవడంతో మనస్తాపం చెంది సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుటుంబ సభ్యులు సాగర్‌లోని కమాలానెహ్రూ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వీరబాబు తెలిపారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటకు చెందిన కడుదల సంపత్ (57)కు 4.30 ఎకరాల భూమి ఉంది. ఇందులో పత్తి వేయగా.. పంట పెట్టుబడి, ఇతర ఖర్చుల కోసం రూ.4 లక్షల అప్పు చేశాడు. నడుం నొప్పితో బాధపడుతూ.. వైద్యం కోసమూ అప్పులు చేస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఆదివారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. ఇంటి చుట్టుపక్కల వారు, కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ప్రైవేట్ దవాఖానకు తరిలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సంతోష్ తెలిపారు.
విద్యుదాఘాతంతో మరో రైతు మృతి
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు మండలం మద్దిగట్లకు చెందిన రైతు మేకల లక్ష్మయ్య (62) ఆదివారం పొలం వద్ద నీరు పారించేందుకు బోరు మోటర్ వేసేందుకు స్టార్టర్ వద్దకు వెళ్లాడు. అక్కడ కరెంట్ వైర్ కొద్దిగా తేలి ఉండగా గమనించకుండా ఆన్ చేసే క్రమంలో చేతికి తగిలి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. రాత్రి 9 గంటలైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో రైతు కొడుకులు శివరాజ్, మల్లేశ్ పొలం వద్దకు వెళ్లి చూడగా.. అప్పటికే విగత జీవిగా కనిపించాడు. జిల్లా దవాఖానకు తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.
గుండెపోటుతో టెన్త్ విద్యార్థిని మృతి
జ్యోతినగర్, ఆగస్టు 12: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని సెయింట్క్లేర్ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని ఎం సాహితి (15) ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందింది. బాలికకు రాత్రి ఛాతీ లో నొప్పి రావడంతో కుటుంబ సభ్యు లు టౌన్‌షిప్‌లోని ఎన్టీపీసీ ధన్వంతరి దవాఖానకు తరలించారు. నొప్పి ఎక్కువ కావడంతో వైద్యులు కరీంనగర్ దవాఖానకు రెఫర్ చేశారు. దీంతో అక్కడి నుంచి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. తండ్రి రాజలింగు రామగుండం ఎన్టీపీసీ ఉద్యోగి.
విద్యార్థికి టీచర్ పనిష్మెంట్
జవాబు చెప్పలేదని కింద కూర్చోబెట్టిన టీచర్
ఎదులాపురం, ఆగస్టు 12: ఆదిలాబాద్ పట్టణం వెంకట్రావు కాలనీలోని ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థి సోమవారం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. టీచర్ పనిష్మెంట్ ఇచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం ఎప్పటిలాగే తరగతులు జరుగుతున్నాయి. క్లాసులో టీచర్ సబ్జెక్ట్‌కు సంబంధించి ప్రశ్నలు అడిగారు. జవాబు చెప్పని విద్యార్థిని పనిష్మెంట్ ఇచ్చి కింద కూర్చోబెట్టారు. దీనిని అవమానంగా భావించిన ఆ విద్యార్థి నేరుగా పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. పోలీసుల ముందు తన గోడు వెల్లబోసుకున్నాడు. ఇంతలో సమాచారం తెలుసుకున్న విద్యార్థి తండ్రి హుటాహుటిన పోలీస్‌స్టేషన్ వచ్చి కుమారుడిని సముదాయించి ఫిర్యాదు చేయొద్దని తీసుకెళ్లాడు. దీంతో ఈ విషయం పాఠశాలలో, పోలీస్ స్టేషన్లో చర్చనీయాంశంగా మారింది.