హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : గ్రామసభల్లో మర్లబడుతున్న పల్లెలే సర్కార్ వైఫల్యాలకు నిదర్శమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించడం, ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు లేదని ములుగు జిల్లా బుట్టాయిగూడెంలో కుమ్మరి నాగయ్య అనే దళిత రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించడం మనసును కలచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు గ్రామసభల్లో చోటుచేసుకుంటున్న సంఘటనలు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నాయని స్పష్టంచేశారు. తన చావుతోనైనా అర్హులైన పేదలకు పథకాలు ఇవ్వాలని అధికారులకు చెప్తూ పురుగుల మందు తాగి, దవాఖాన పాలైన రైతన్న దుస్థితికి ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు.
ఆత్మహత్యలు పరిషారం కాదు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ పార్టీపై కొట్లాడుదాం. హకుగా రావాల్సిన పథకాలను సాధించుకుందాం. బీఆర్ఎస్ అండగా ఉంటుంది. ఎవరూ ధైర్యం కోల్పోవద్దు. ఆత్మహత్యలకు పాల్పడకూడదు.
– హరీశ్‌రావు
పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే యావతో, ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా చేయకుండా, జాబితాను విడుదల చేయడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంటున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు.. కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు అంటూ బాహాటంగా ప్రకటించడం గ్రామసభల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పట్ల ప్రజల్లో ఆందళనకు కారణమని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు, రైతుభరోసా, ఆత్మీయభరోసా పథకాలు ఈ నెల 26న ప్రారంభిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ, మరోవైపు గ్రామసభల్లో విడుదలచేసిన జాబితా ఫైనల్ కాదని సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని విమర్శించారు. ఫైనల్ జాబితా కాకపోతే నాలుగు రోజుల పరిమితి పెట్టి గ్రామసభలు నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటి? గ్రామసభల్లో విడుదల చేస్తున్న అర్హుల జాబితాకు ఉన్న విలువ ఏమిటి? అని నిలదీశారు.
గ్రామసభల సాక్షిగా తిరగబడుతున్న జనం, ఎకడికడ నిలదీస్తున్న తీరు.. రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని చెప్పి, ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట అభయహస్తం కాదు, భస్మాసుర హస్తంగా మారింది.
400 రోజులపాటు అన్ని వర్గాల ప్రజలను విజయవంతంగా మోసం చేస్తూ జనవరి 26న మరో మోసానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వ పథకాలకు తాము అన్ని విధాలుగా అర్హులమని ప్రజలు ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. మీ-సేవ కేంద్రాల్లో, ప్రజాపాలన సెంటర్లలో, కులగణన సందర్భంలో, తాజాగా ఇప్పుడు గ్రామసభల్లో ఇలా ఎంతకాలం దరఖాస్తు చేసుకోవాలో చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్మిడీలాభం లేని దరఖాస్తులను ఎన్నని చేయాలని మండిపడ్డారు. గ్రామసభల్లో దరఖాస్తులు కాంగ్రెస్ డ్రామాకు మరో ఎత్తుగడ అని విమర్శించారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతుభరోసా, ఆత్మీయభరోసా పథకాలు పేదలకు అందించాలనే చిత్తశుద్ధి ఉంటే, గ్రామసభల పేరిట ఇంత డ్రామా అవసరమా? అని ప్రశ్నించారు. ఐటీలో మేటిగా ఉన్న తెలంగాణలో ప్రజలు పనులు వదులుకొని, రోజులపాటు గ్రామసభల్లో నిరీక్షించాల్సిన అవసరం ఏమొచ్చిందని, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలనుకుంటే టెక్నాలజీని ఎందుకు వినియోగించడం లేదని నిలదీశారు. దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప, ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసిందేమీలేదని ఆరోపించారు.