భీమదేవరపల్లి, ఫిబ్రవరి 17 : తన భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నాడని ఆరోపిస్తూ మాజీ సర్పంచ్ ఇంటి ఎదుట ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్లో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బక్కయ్యకు ఇద్దరు కుమారులు. ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తన భూమిని మాజీ సర్పంచ్ రాచర్ల సారయ్య అక్రమంగా పట్టా చేసుకున్నాడని పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. పెద్దలు చెప్పినా వినకపోవడంతో విసుగు చెందిన బక్కయ్య .. రాచర్ల సారయ్య ఇంటికి పురుగుల మందు డబ్బాతో వెళ్లాడు. భూమిని తనకు పట్టా చేయాలని ఆవేదనతో విలపిస్తూ పురుగులమందు తాగాడు. గమనించిన స్థానికులు బక్కయ్యను ముల్కనూరులోని ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. బక్కయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.