వరంగల్ చౌరస్తా, మార్చి15: బ్యాంకు అధికారులు వేధిస్తున్నారని ఓ వ్యాపారి కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శనివారం వరంగల్ చౌరస్తాలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన చెల్లుపూరు హేమ్‌కుమార్, అనంద్‌కుమార్ సోదరులు. వీరు వ్యాపారంకోసం కాజీపేటలోని యూనియన్ బ్యాంక్‌లో 2017లో రూ.కోటి 20 లక్షలు రుణం తీసుకున్నారు. చెల్లింపు విషయంలో ఆలస్యం కావడంతో బ్యాంకు అధికారులు తనఖా ఉన్న ఇంటిని విక్రయించారు. కొనుగోలుదారుడికి అప్పగించే క్రమంలో రుణగ్రహీతలు సహకరించకపోవడంతో అధికారులు పోలీస్ బందోబస్తుతో తనఖా ఉన్న భవనం వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న హేమ్‌కుమార్, ఆనంద్‌కుమార్ కుటుంబసభ్యులతో చేరుకొని తమ ఆస్తిని తమకుకాకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ వరంగల్ చౌరస్తాలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నంచేశారు. ఈ ఘటనలో వెంకటేశ్వర్లు (60)తో పాటు తన అల్లుడు ప్రశాంత్ (32), హేమ్‌కుమార్ కోడలు తేజస్వి(35)కి మంటలు అంటుకొని తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు మంటలను ఆర్పి, బాధితులను వెంకటరమణ జంక్షన్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు.