ఇందిరమ్మ ఇండ్లు అందేది ఎందరికోగాని, అవి రాకముందే పథకంపై గందరగోళం నెలకొన్నది. ఓవైపు జాబితాలో అవకతవకలు చోటుచోసుకోవడం, అనర్హులను ఎంపిక చేయడంపై విమర్శలు వస్తుండగా.. మరోవైపు జాబితాలో తమ పేరు రాకపోవడంతో ఆశలు పెట్టుకున్న పేదలు ఆందోళనకు గురవుతున్నారు. సొంతింటి కల ఇక నెరవేరదేమోనని కలత చెంది పెద్దపల్లి జిల్లా కిష్టంపేటలో ఒకరు ఉరివేసుకోగా, కొడుకుకు ఇల్లు మంజూరుకాకపోవడంతో ఖమ్మం జిల్లా తెల్దార్‌పల్లిలో ఓ తండ్రి గుండె ఆగింది.సందట్లో సడేమియాగా మున్సిపాల్టీల్లో ప్రత్యేకపాలన మొదలైన తొలిరోజే ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేర్లు ఎక్కిస్తామని చెప్పి ఏకంగా లంచాలకు తెరలేపి ఓ అధికారి ఏసీబీకి పట్టుబడటం కలకలం రేపింది. జనగామలో తన ఇంటి నంబర్‌పై నలుగురికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడంతో యజమాని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
కాల్వశ్రీరాంపూర్: ఎన్నో ఆశలతో ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాలో తన పేరు రాలేదని ఓ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా కిష్టంపేటలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. గ్రామానికి చెందిన పురుషోత్తం ప్రభాకర్ (45), రమ భార్యభర్తలు. పూరి గుడిసెలోనే ఉంటూ బతుకీడుస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. రమకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇటీవల తన తల్లిగారింటికి వెళ్లింది. అర్హుల జాబితాలో వీరి పేరు రాకపోవడంతో మనస్తాపం చెందిన ప్రభాకర్, ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు కాల్వశ్రీరాంపూర్ దవాఖానకు తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. ప్రభాకర్ తల్లి మధునమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు రానందునే తన భర్త కలత చెంది ఉరేసుకొని చనిపోయాడని పెద్దపల్లి దవాఖాన వద్ద అతడి భార్య రమ కన్నీటి పర్యంతమైంది. తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకున్నది.
ఇల్లు రాదేమోనని ఆగిన గుండె
ఖమ్మం రూరల్: ఇందిరమ్మ ఇల్లు ఇక రాదేమోనని ఓ తండ్రి గుండె ఆగిపోయింది. ఖమ్మం జిల్లాలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామసభలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల అర్హుల జాబితాను వెల్లడించింది. జాబితాల్లో అన్నీ అనర్హుల పేర్లే ఉండటం, అర్హులు ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. చివరికి నామమాత్రంగా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయితే, అర్హుల జాబితాలో తమ పేర్లు లేకపోవడం, అనర్హుల పేర్లే ఉండడంతో పేదలు తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో ఈ నెల 23న జరిగిన గ్రామసభలో తన కొడుకు రాము పేరు ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలో రాలేదని తండ్రి చాట్ల కృష్ణయ్య (62) మనస్తాపానికి గురయ్యాడు. అప్పటి నుంచి నలతగా ఉంటున్న కృష్ణయ్య ఆదివారం రాత్రి గుండెపోటుతో చనిపోయాడు. మాజీ సర్పంచ్ సిద్దినేని కోటయ్య, సీపీఎం నాయకుడు తమ్మినేని కోటేశ్వరరావు వచ్చి కృష్ణయ్య మృతదేహానికి నివాళులర్పించి మాట్లాడారు. నిరుపేద కృష్ణయ్య కుటుంబానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సత్తుపల్లిటౌన్: ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల అర్హుల జాబితాలో పేర్లు ఎక్కించేందుకు లంచం డిమాండ్ చేసిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ వార్డు అధికారి నల్లటి వినోద్‌కుమార్ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. సత్తుపల్లి పట్టణంలోని 23వ వార్డుకు చెందిన ఓ మహిళ వద్ద వార్డు అధికారి వినోద్‌కుమార్ ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌కార్డు కావాలంటే తనకు రూ.3 వేలు ఇస్తే లిస్టులో పేరు వచ్చేలా చేస్తానని తెలిపాడు. దీంతో ఆ మహిళ ఖమ్మం ఏసీబీ కార్యాలయానికి నేరుగా వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు సత్తుపల్లిలో ఈ నెల 25న రెక్కీ నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం పాత సెంటర్లోని హెచ్‌పీ పెట్రోల్‌బంక్ పక్కన ఉన్న జ్యూస్ సెంటర్ వద్దకు వచ్చి నగదు ఇవ్వాలని సదరు ఉద్యోగి మహిళకు చెప్పడంతో ఆ మహిళ ఏసీబీ అధికారులు కెమికల్ కలిపి ఇచ్చిన రూ.2500 వార్డు అధికారికి ఇచ్చింది. అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ డీఎస్పీ వై రమేశ్ తన సిబ్బందితో సదరు ఉద్యోగిని రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. వినోద్‌కుమార్‌ను వరంగల్ ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. సత్తుపల్లి మున్సిపాలిటీ పాలకవర్గం ఈ నెల 26న ముగిసిపోయి ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నది. ప్రత్యేక అధికారి పాలన మొదటిరోజునే ఇలా జరగడంతో అధికారుల పాలనలో జవాబుదారీతనం ఎలా ఉంటుందోనని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఒకే ఇంటి నంబర్.. నలుగురికి ఇండ్లు
జనగామ చౌరస్తా: ఒకే ఇంటి నంబర్‌పై నలుగురికి ఇండ్లు మంజూరైన విషయం జనగామలో సోమవారం వెలుగుచూసింది. మున్సిపల్ అధికారుల తీరుపై ప్రజల్లో విస్మయం వ్యక్తమవుతున్నది. జనగామ పట్టణంలోని 26వ వార్డు గణేశ్‌వాడ ఏరియాకు చెందిన పొన్నాల నాగరాణి-జగత్ కుమార్ దంపతులు 35 ఏండ్లుగా 3-6-14 నంబర్ ఇంటిలో నివాసముంటున్నారు. వీరి ఇంటి నంబర్‌తో పాటు మూడు బై నంబర్లపై ఎర్ర రూప, జీ సృజన, కూచన సునీత, కొమురాలి భాగ్యలక్ష్మికి అధికారులు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారు. నలుగురి ఆధార్ కార్డులపై ఇదే ఇంటి నంబర్‌తో అడ్రస్ ఉన్నట్టు తెలిసింది. ఈ విషయంపై సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో సదరు ఇంటి యజమాని జగత్ కుమార్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తన ఇంటి నంబర్ నుంచి ఆ నలుగురి అడ్రస్ మార్చాలని కోరారు. ఈ విషయంపై పూర్తి విచారణ జరపాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లును ఆదేశిస్తూ కలెక్టర్ రిజ్వాన్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదు చేసిన ఇంటి యజమాని జగత్ కుమార్ స్థానిక కాంగ్రెస్ నాయకుడు కావడం విశేషం.