హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : కరోనా వ్యాక్సిన్ ప్రభావంతోనే దేశంలో ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయని యూనివర్సల్ హెల్త్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ అమితవ్ బెనర్జీ చెప్పారు. దేశవ్యాప్తంగా వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో సహా ఇతర కారణాలతో ప్రజలు ఆకస్మికంగా మరణించడం ఆందోళనకరమని అన్నారు. యూనివర్సల్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అమితవ్ బెనర్జీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, ఫార్మా కంపెనీలు కుమ్మక్కై కరోనా మహమ్మారిని బూచిగా చూపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. కరోనా సమయంలో సంభవించిన మరణాల కంటే ఆ తరువాత సంభవిస్తున్న మరణాలు రెట్టింపవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
కరోనా వ్యాక్సిన్ పనితీరును పూర్తిస్థాయిలో నిబంధనల ప్రకారం పరీక్షించకుండానే ప్రజలకు వేయడం ద్వారా అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా గుండెపోటు, త్రాంబోసిస్, త్రాంబోసైటోపీనియా, ఫేషియల్ పక్షవాతం, పలు రకాల క్యాన్సర్లు సోకుతున్నాయని వెల్లడించారు. కరోనా టీకా వేయని దేశాల్లో ఇలాంటి మరణాలు నమోదైన దాఖలాలు లేవని స్పష్టంచేశారు. ఆఫ్రికా సహా పలు ద్వీపాల్లో పోస్టు కరోనా మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఆకస్మిక మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరంగా ఉందని అన్నారు. కనీసం ఆకస్మిక మరణాలకు కారణాలను అన్వేషించడానికి కూడా ప్రభుత్వాలు చొరవ తీసుకోకపోవడానికి కారణమేమిటని ప్రశ్నించారు. కరోనాను బూచిగా చూపి రూ.5 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని వెల్లడించారు. కోట్ల రూపాయల ప్రజల సొమ్మును వెచ్చించింది వారి మరణాలను పెంచడానికేనా? అని నిలదీశారు.
దేశవ్యాప్తంగా గుండెపోటు, రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోవడం, ఆకస్మికంగా క్యాన్సర్ల బారిన పడి ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడంలేదని రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న వక్తలు ప్రశ్నించారు. గుండెపోటు సంభవిస్తే జీవన విధానంలో మార్పులే కారణమని నిపుణులైన డాక్టర్లు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నదని పేర్కొన్నారు. చిన్న పిల్లలు, ఎలాంటి చెడు అలవాట్లు లేని వారే ఎక్కువగా కార్డియాక్ అరెస్ట్ (గుండెపోటు) బారిన పడి చనిపోతున్నారని గుర్తుచేశారు. ఈ మరణాలకు కారణాలు తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చేయకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కారణాలను అన్వేషిస్తే ఫార్మా కంపెనీలు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన కరోనా వ్యాక్సిన్ డీల్ బయటపడుతుందని భయపడుతున్నారేమోనని అనుమానం వ్యక్తంచేశారు. పేరు మోసిన వైద్యులు కూడా ఆకస్మిక మరణాలపై నోరు మెదపకపోవడంతో ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి కర్ణాటక తరహాలో ఆకస్మిక మరణాలపై ప్రత్యేక కమిటీని వేసి పరిశోధించాలని డిమాండ్‌చేశారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టకుంటే మరిన్ని మరణాలు సంభవించే పరిస్థితి దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.