Jublee Hills By Poll | హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక ఇప్పుడే ఉండకపోవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు చనిపోవడంతో ఆ స్థానం ఖాళీ అయినట్టు అసెంబ్లీ నుంచి గెజిట్ నోటిఫికేషన్ అందిందని తెలిపారు. ఆ గెజిట్‌ను యథాతథంగా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిచామని చెప్పారు. ఉపఎన్నిక ఎప్పుడు నిర్వహించాలనేది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని, ప్రస్తుతానికి మూడు నాలుగు రాష్ర్టాల్లో ఉపఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే వచ్చిందని అన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఆరునెలల సమయం ఉంటుందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ, ఎలక్షన్ కమిషన్ విధులపై అవగాహన కల్పించడంలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు, బూత్ లెవల్ ఏజెంట్స్, అన్ని రాజకీయ పార్టీలు ఈఆర్ఓ (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్), ఆర్వోలు, కలెక్టర్లు, డీఈవో (జిల్లా ఎన్నికల అధికారి)లతో ప్రతి నెల రెండు రోజులు సంప్రదింపుల కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిన మార్పులపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
పోలింగ్ స్టేషన్‌లోని ఒక్కో బూత్‌లో ఓటర్ల సంఖ్యను 1500 నుంచి 1200కు కేంద్ర ఎన్నికల సంఘం తగ్గించినట్టు సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ జనాభా కారణంగా హైరైజ్ బిల్డింగ్స్, రెసిడెన్షియల్ అసోసియేషన్స్ వద్ద పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఈసీఐ సూచనప్రాయంగా తెలిపిందన్నారు. బీహార్ ఎన్నికల్లో ఈ కొత్త పద్ధతిని అమలు చేసిన తర్వాత దీనిపై ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పోలింగ్‌స్టేషన్ వద్ద ఫోన్లు డిపాజిట్ చేసుకునే విధానాన్ని అమలు చేయనున్నామని చెప్పారు.
రాష్ట్రంలో ఈ నెల 26, 27న బ్లాక్ లెవల్ అధికారులు, ఏజెంట్లకు ఎన్నికల సంఘం శిక్షణ ఇస్తుందని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఓటర్ ఐడీకి ఆధార్ లింక్ అనేది ఆప్షన్ మాత్రమేనని, గ్రామీణ ప్రాంతాల్లో 84శాతం పూర్తయిందని చెప్పారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఇతర దేశాలతో పోల్చి ప్రజలకు తేడాలు వివరించాలని ఈసీఐ తమను ఆదేశించిందన్నారు. తెలంగాణను బెల్జియంతో పోల్చాలని ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. బెల్జియంలో ఓటు వేయకపోతే జరిమానాలు విధిస్తారని చెప్పారు.