హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) ప్రక్రియ చేపట్టనున్న నేపథ్యంలో ఈ నెలాఖరులోగా ఓటర్ల మ్యాపింగ్‌లో 90 శాతం పురోగతి సాధించాలని కలెక్టర్లను, అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయం నుంచి సోమవారం రాష్ట్రంలోని జిల్లా ఎన్నికల అధికారులు (డీఈవోలు), ఓటర్ల నమోదు అధికారులతో (ఈఆర్వోలు) ‘సర్’ఫై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సర్’ పురోగతిపై పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ప్రతి బుధవారం రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి, మ్యాపింగ్ పురోగతిని సమీక్షించాలని కలెక్టర్లకు సూచించారు.
మ్యాపింగ్ ప్రక్రియలో రెసిడెన్షియల్ అసోసియేషన్లు, గేటెడ్ కమ్యూనిటీలను భాగస్వాములను చేయాలని సూచించారు. మ్యాపింగ్ ప్రక్రియ కోసం హెల్ప్డెస్లను ఏర్పాటుచేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలు, రేషన్ డీలర్లు, ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సహకారాన్ని కూడా తీసుకోవాలని తెలిపారు. నియోజకవర్గాల్లోని వీఐపీ, వీవీఐపీ ఓటర్ల మ్యాపింగ్‌పై దృష్టి సారించాలని పేర్కొన్నారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్వో) ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచిత వ్యక్తులకు ఓటరు సమాచారాన్ని లేదా ఓటీపీలను షేర్ చేయొద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.