‘పాత తేదీలతో కాగితం పట్టుకొచ్చారా.. అయితే ఆ సర్కారీ స్థలం మీదే! కబ్జా చేసుకోవడానికి నిబంధనలు అడ్డుగా ఉన్నాయా? ఏం పర్లేదు.. సేల్‌డీడ్‌ను చూపిస్తే రికార్డులన్నీ మార్చిపారేస్తం!’ గోపన్‌పల్లి ప్రభుత్వ భూముల సంతర్పణలో అధికారుల నుంచి ఇలాంటి అనధికార ఆఫర్లే ఇప్పుడు హాట్‌టాపిక్! ఎవరు ఏ కాగితం పట్టుకొచ్చినా.. సుప్రీంకోర్టు సూచనలను ముందుపెట్టి రంగారెడ్డి జిల్లా అధికారులు ఎన్వోసీలు ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల కోసమో.. అక్రమార్కుల కోసమో.. వక్రమార్గంలో పయనిస్తున్నారు.
(స్పెషల్ టాస్క్బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ):రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో ఐటీ కారిడార్‌కు ఆనుకొని ఎకరా రూ.వంద కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలతో అధికారులు పప్పు బెల్లాల్లా ప్రైవేటు వ్యక్తులకు పంచి పెడుతున్నారనేందుకు ఉదాహరణలు అనేకం. బహిరంగ మార్కెట్లో రూ.18,900 కోట్ల విలువ చేసే గోపన్‌పల్లి సర్వే నంబరు 36, 37ల్లోని 189.11 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు తెర వెనక ఎంత పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందనేందుకు సాక్ష్యాలు కోకొల్లలు. ప్రైవేటు వ్యక్తుల పేరిట భారీస్థాయిలో ఎన్వోసీలు జారీ అయినట్టు తెలుస్తున్నది. కానీ అధికార యంత్రాంగం వాటన్నింటినీ తొక్కి పెట్టింది. ఒక్క కాగితాన్ని కూడా బయటికి రానీయడం లేదు.
శేరిలింగంపల్లి తహసీల్దార్ నుంచి రంగారెడ్డి కలెక్టర్ వరకు ఈ భూములపై జరుగుతున్న దందాపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించడం లేదు. చివరకు ఈ భూ దందాపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ఫిర్యాదు వెళ్లినా పట్టించుకోవడం లేదంటే తెర వెనక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు తమ బకాయిలను అడిగితే ‘పైసల్లేవ్… కోసుకు తింటారా?’ అని వెటకారంగా మాట్లాడిన ప్రభుత్వ పెద్దలు దాదాపు రూ.19వేల కోట్ల ప్రజల సొమ్ము ప్రైవేటుపరం అవుతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదో అర్థం చేసుకోవచ్చు.
గోపన్‌పల్లిలోని ఈ రెండు సర్వేనంబర్లలో ఉన్న 182.11 ఎకరాల భూమి ప్రభుత్వానిది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల ఇండ్ల స్థలాలకు ఇవ్వడమే కాకుండా అందులో అధికారికంగా లేఅవుట్ కూడా చేశారు. ఈ క్రమంలో 2014లో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగుల కోసం ఏపీ ఎన్జీవోల నుంచి ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఉమ్మడి రాష్ట్రంతో పాటు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనూ డీ నర్సింగరావు, ఇతరులు సుప్రీం కోర్టు దాకా వెళ్లి అందులో 91 ఎకరాలపై ఖాస్రా పహాణీలో తమ పేర్లు వస్తున్నాయని క్లెయిమ్ చేశారు. వాళ్ల వినతి మేరకు ప్రభుత్వం తదుపరి రికార్డుల్లో వారి పేర్లను కొనసాగిస్తుందా? లేదా ప్రభుత్వ భూమిగా పేర్కొంటుందా? అని తేల్చేందుకు సరైన న్యాయ వేదికను ఆశ్రయించవచ్చని మాత్రమే సుప్రీం కోర్టు సూచించింది.
ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం విచారణ చేయించగా, గతంలో ఉద్యోగులకు ఇచ్చిన 189.11 ఎకరాల్లో ఆ 91 ఎకరాలు లేదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ప్రైవేటు వ్యక్తులు ఆశలు వదులుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుప్రీం ఉత్తర్వులను అడ్డు పెట్టుకొని భూ పందేరానికి తెర తీశారు. అసలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన వారికి కాకుండా అధికారులు ఇతరుల పేరిట ఎన్వోసీ ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. తెర వెనక ప్రభుత్వ పెద్దలు, వారిని భారీస్థాయిలో ‘సంతృప్తి’పరిచిన ప్రైవేటు వ్యక్తులకు ఈ భూములు కట్టబెడుతున్నారనే విమర్శలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అందుకే తెలంగాణ ఉద్యోగులు ఇన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోకుండా ఉంటుందనే ఆరోపణలున్నాయి.
సుప్రీంకోర్టు సూచనల ఆధారంగా 91 ఎకరాలపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నా.. ప్రభుత్వ పెద్దలు ఏకంగా 189.11 ఎకరాలకు స్కెచ్ వేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే అధికారులు ఇష్టానుసారంగా నిబంధనలకు పాతరవేసి ఎన్వోసీలు జారీ చేస్తున్నారని అంటున్నారు. ‘నమస్తే తెలంగాణ’ ఈ భూదందాను వెలుగులోకి తీసుకురావడంతో ప్రస్తుతానికి ప్రక్రియపై వ్యూహాత్మకంగా యథాతథ స్థితిని కొనసాగిస్తున్నారు. లేకపోతే ఇప్పటికే 189 ఎకరాలు పల్లీ బఠాణీల్లా చేసి వేల కోట్ల రూపాయలు చేతులు మారేవి. అయితే ఇంత జరుగుతున్నా… ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోకపోవడంతో సీసీఎల్ఏ మొదలు రంగారెడ్డి కలెక్టరేట్, దిగువన ఆర్డీవో, తహసీల్దార్, ఇతర యంత్రాంగం వరకు తమకేమీ కాదనే ధీమాతో అదును చూసి మిగిలిన ప్రక్రియను ముగించాలని చూస్తున్నారు.
గోపన్‌పల్లి భూముల వ్యవహారంలో ప్రధానంగా రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి మొదలు దిగువన ఆర్ఐ, సర్వేయర్ వరకు వ్యవహరిస్తున్న తీరుపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 1990 మొదలు 2023 వరకు అంటే ఉమ్మడి రాష్ట్రంలో నుంచి కేసీఆర్ ప్రభుత్వం వరకు ఉన్న అధికారులు ఈ ప్రభుత్వ భూములు ప్రైవేటుపరం కాకుండా సమర్థ వాదనలు వినిపించారు. ఖాస్రా పహాణీలో పేర్లు రావడం మినహా ఏఒక్క రికార్డుల్లోనూ సదరు వ్యక్తుల పేర్లు రాలేదని సుప్రీం దాకా నివేదికలు ఇచ్చారు. 2021లోనూ రంగారెడ్డి కలెక్టర్, రాజేంద్రనగర్ ఆర్డీవో ఈ భూములకు ప్రైవేటు వ్యక్తులకు సంబంధంలేదని నివేదిక ఇచ్చారు. కానీ ఇప్పుడున్న అధికారులు ఇచ్చిన ఎన్‌వోసీల్లో ఖాస్రా పహాణీల్లోనే కాదు… రికార్డుల్లో (ఏటా పహాణీల్లో) కూడా ప్రైవేటు వ్యక్తుల పేర్లు వచ్చాయని పేర్కొంటున్నారంటే ప్రభుత్వ పెద్దలకు ఏ రీతిన దాసోహం అయ్యారో అర్థం చేసుకోవచ్చనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎందుకంటే… రిజిస్ట్రేషన్ శాఖలో ఈ రెండు సర్వే నంబర్లకు సంబంధించిన వివరాలు తీస్తే సబ్ డివిజన్స్ అంకెల్లో ఉన్నాయి. కానీ ప్రస్తుతం అధికారులు ఇస్తున్న ఎన్‌వోసీల్లో సబ్ డివిజన్స్ అక్షరాల్లో ఉన్నాయి. అంటే ఓ పద్ధతి లేకుండా ఉన్న రికార్డుల ఆధారంగా యాజమాన్య హక్కుల్ని ఇప్పుడు నిర్ధారిస్తున్నారంటే చట్టాలు, కోర్టులంటే అధికారులకు ఎలాంటి భయం లేదనేందుకు ఇదో నిదర్శనం. పైగా ఈ సర్వేనంబర్లలో సప్లమెంటరీ సేత్వార్స్ (పొడి) లేదని గతంలో కలెక్టర్ నివేదికలో ఉంది. వాస్తవానికి ఇప్పుడు కూడా అవి లేవు. అంటే సర్వే, హద్దులు, మ్యాపులు ఇవేవీ లేకుండానే అధికారులు ఇష్టానుసారంగా ఎన్వోసీలు ఇస్తుంటే… ప్రైవేటు వ్యక్తులు ప్రధాన రహదారికి దగ్గరగా ఉన్న భూమిని తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నారు.
శేరిలింగంపల్లి, ఆగస్టు 3: తమకు కేటాయించిన సొసైటీ స్థలాన్ని తమకే కేటాయించాలని ప్రభుత్వాన్ని భాగ్యనగర్ టీఎన్జీవోలు డిమాండ్ చేశారు. కొద్దిరోజులుగా గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల కార్యాలయం వద్ద కొనసాగుతున్న వీరి ఆందోళన ఆదివారం 19వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఒంటికాలుపై నిలబడి చేతులు జోడిండి దండా లు పెడుతూ మాకు న్యాయం చేయాలని వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సొసైటీ స్థలాన్ని ఆక్రమార్కుల నుంచి కాపాడాలని కోరారు. తమకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో బీటీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ, టీఎన్జీవోస్ మ్యూచివల్ ఏయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌రావు, సెక్రటరీ మల్లారెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, డైరక్టర్లు ప్రభాకర్ రెడ్డి, రషీదా బేగం, సంధ్య, నర్సింహారాజు, ఎక్నాథ్ గౌడ్, నాయక్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూముల్ని కాపాడేందుకు రేవంత్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. కానీ అదే చేత్తో ఒక ప్రైవేటు కంపెనీ ఎకరాకు వంద కోట్లు విలువ చేసే భూముల్ని ఎకరాలకొద్దీ స్వాధీనం చేసుకొని ఎలాంటి అనుమతులు లేకుండా లేఅవుట్ చేస్తుంటే అధికారులు కండ్లప్పగించి చూస్తున్నారు. గతంలో మహేశ్వరం మండలం నాగారం భూదాన్ భూముల్లో జరిగిన అరాచకమే ఇక్కడ పునరావృతం అవుతుందనే ఆరోపణలున్నాయి. అక్కడ చక్రం తిప్పిన ప్రైవేటు వ్యక్తి కూడా ఇక్కడ అదే తరహాలో అరాచకాన్ని సృష్టిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. కీలక మంత్రికి రూ.100 కోట్లు ముట్టజెప్పి ప్లాట్ల మాటున ఈ భూములను చెరబడుతున్నారనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు, ప్రభుత్వం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉన్నది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి పరిధిలోని సర్వేనంబర్ 37లోని (సబ్ డివిజన్స్ 37/రు-2 ఎకరాలు, 3ఎ/లు-6 ఎకరాలు) ఎనిమిది ఎకరాల భూమిపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి జారీ చేసిన ఉత్తర్వులు ఇవి. ప్రభుత్వ భూమిగా ఉన్న ఈ ఎనిమిది ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, ఐజీకి ఈ లేఖ రాశారు. ‘1954-55 ఖాస్రా పహాణిలో సర్వేనెంబరు 37/రూ-2 ఎకరాలు, 37/లు-6 ఎకరాలు మొత్తం ఎనిమిది ఎకరాల భూమి గౌలిదొడ్డికి చెందిన తొల్లి మహదేవ్ పేరిట వచ్చింది.
ఆయన మరణానంతరం రికార్డుల్లో మహదేవ్ కుమారుడు తొల్లి సిద్దోబా పేరు వచ్చింది. ఆయన చనిపోయిన తర్వాత 1984లో సిద్దోబా భార్య, వారసులు కలిసి ఆమంచర్ల నర్సింహారావుకు 4215/1984 సేల్‌డీడ్ ద్వారా విక్రయించారు. ఇప్పుడు నర్సింహారావు కుమారుడు మల్లికార్జునరావు ఈ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని దరఖాస్తు చేశారు. కోర్టుల తీర్పులను కూడా పరిశీలించిన తర్వాత దరఖాస్తుదారుడి వినతి మేరకు నిషేధిత జాబితా నుంచి తొలగించండి’ అని లేఖలో పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తన లేఖలో పొందుపరిచిన 4215/1984అనే డాక్యుమెంట్‌ను పరిశీలించగా రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో 1984, జూలై 11వ తేదీన జరిగిన రిజిస్ట్రేషన్‌కు సంబంధించినదిగా తేలింది. కానీ ఇది గోపన్‌పల్లి సర్వేనంబర్37కు సంబంధించినది కాదు. రాజేంద్రనగర్ తాలూకాలోని బాగ్అమీర్ గ్రామపరిధిలోని వివేకానందనగర్ సర్వేనంబర్ 139లో 325 చదరపు గజాల ప్లాటుకు సంబంధించిన విక్రయ దస్తావేజుగా తేలింది. పేర్లు కూడా ఇతరులవి ఉన్నాయి.
రంగారెడ్డి కలెక్టర్ పేర్కొన్న వివరాల ఆధారంగా అధ్యయనం చేస్తే డాక్యుమెంట్ నంబర్ 4125/1984గా తేలింది. అంటే కలెక్టర్ రాసిన లేఖలో వేసిన నంబర్ తప్పు అన్నమాట. ఆ ఈసీని పరిశీలిస్తే తొల్లి వారసులు 2009 అక్టోబర్‌లో 37/లు-6 ఎకరాలను సబావత్ మీరాబాయికి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏ (ఏజీపీఏ) చేశారు. ఇలా 2011 వరకు ఏకంగా ఆరు డాక్యుమెంట్లు వివిధ రకాల పేర్లతో ఉండటంతో అవి ప్లాట్లుగా మారినట్టు పలు ఆధారాలున్నాయి. చివరకు ఏ నర్సింహారావు కూడా ప్లాట్లు చేసి విక్రయించినట్టుగా ఉంది. అలాంటప్పుడు మల్లికార్జునరావుకు హక్కులెలా వస్తాయో అధికారులకే తెలియాలి.
కలెక్టర్ ఇచ్చిన ఎన్వోసీ ప్రకారం తొల్లి సిద్దోబా చనిపోయిన తర్వాత ఆయన భార్య, వారసుల పేర్లు రికార్డుల్లోకి రాలేదనేది స్పష్టమవుతుంది. అలాంటప్పుడు యాజమాన్య హక్కులు దఖలు కాకుండా చేసిన రిజిస్ట్రేషన్‌ను ఎలా అనుమతిస్తారు? తొల్లి సిద్దోబా భార్య, వారసులు ఆ డాక్యుమెంట్లో తాము పూర్తి హక్కుదారులుగా మాత్రమే పేర్కొన్నారేగానీ కనీసం రెవెన్యూ రికార్డుల్లో తమ పేరు ఉందని, పాసు పుస్తకాలు ఉన్నాయని (వాటి నంబర్లు)గానీ అందులో పొందుపరచలేదు. అంటే ఫౌతి కాకుండానే వాళ్లు విక్రయించారనేది వాస్తవం. మరోవైపు 1984లో భూమిని కొనుగోలు చేసిన ఏ నర్సింహారావు 2025 వరకు మ్యుటేషన్‌కు ఎందుకు దరఖాస్తు చేసుకోలేదు? అంటే 1984కు ముందు ఫౌతి కాకపోగా… ఆ తర్వాత మ్యుటేషన్ కూడా జరగలేదు.
మరి ఏ నర్సింహారావు మ్యుటేషన్ చేయించుకోకుండా ఆయన కొడుకు మల్లికార్జునరావు దరఖాస్తు చేసుకుంటే జిల్లా కలెక్టర్ ఆయనను హక్కుదారుడిగా ఎలా ప్రకటిస్తారు? నర్సింహారావు కుమారుడు అయినంత మాత్రాన అధికారులు అలవోకగా రూ.800 కోట్ల విలువైన గోపన్‌పల్లిలోని ఎనిమిది ఎకరాల భూమికి ఎన్వోసీ ఇస్తారా? అసలు సేల్‌డీడ్ అనేవి యాజమాన్య హక్కులు కావనేందుకు గతంలోనే ఎన్నో కోర్టు తీర్పులు ఉన్నాయి. ఇవన్నీ అధికారులకు తెలియనివికావు… కాకపోతే సర్కారు పెద్దలు-రంగారెడ్డి జిల్లా రెవెన్యూ శాఖ అందరూ ‘సంతృప్తి’కరంగా నిబంధనలను బేఖాతరు చేస్తూ ఎన్వోసీ ఇచ్చి, నిషేధిత జాబితా నుంచి తొలగించారనేది స్పష్టమవుతుంది.
ఇది రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఈ ఏడాది జూన్ 11వ తేదీన స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ కమిషనర్‌కు రాసిన లేఖ. నంబర్ ఇ1/202/20205, తేదీ: 11.06.2025. ఇందులో గోపన్‌పల్లి పరిధిలోని సర్వేనంబర్ 36లోని 415.07 ఎకరాలు సర్కారీ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంది. కానీ అందులోని సబ్ డివిజన్స్- 36/ఆ-12.20 ఎకరాలు, 36/ఇ-12.20 ఎకరాలు, 36/ఈ-10 ఎకరాలు, 36/ఊ-10 ఎకరాలు… మొత్తం 45 ఎకరాలు మదన్మోహన్ ప్రసాద్, సురేంద్రమోహన్ ప్రసాద్, వసంత్మోహన్ ప్రసాద్, భీకం ప్రసాద్ అనే నలుగురి పేరిట రికార్డుల్లో వస్తున్నది కాబట్టి, వీటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని వినాయకనగర్ (హాల్) హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బీఏఎస్ శర్మ, కార్యదర్శి డీఆర్ బ్రహ్మం దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్దార్, ఆర్డీవో ఇచ్చిన నివేదిక మేరకు 45 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించండి అని కలెక్టర్ కోరారు. సూచనల్లో (రెఫరెన్సెస్) సీసీఎల్ఏ లేఖ నంబర్‌ను కూడా పొందుపరిచారు.
ఇది కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ కమిషనర్‌కు రాసిన లేఖ. లేఖ నంబర్. ఇ1/202/2015. అదే నంబర్ కాకపోతే తేదీ మాత్రం మారింది. ఈ లేఖను జూలై 23వ తేదీన రాశారు. ఇందులో సర్వేనంబర్ 36లోని సబ్ డివిజన్స్ 36/ఎ, 36/ఇ, 36/ఎఎ1ల్లోని 22.20 ఎకరాల్లో 17.04 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ కోరారు. సూచనల్లో వ్యక్తులుగానీ హౌసింగ్ సొసైటీగానీ దరఖాస్తు చేసుకున్నట్టు లేదు. అందులో 5.16 ఎకరాల్లో ప్లాట్లు ఉన్నందున నిషేధిత జాబితా నుంచి తొలగించాలని చెప్పారు. నిషేధిత జాబితా నుంచి తొలగించడం, చేర్చడంపై కలెక్టర్‌కు అధికారాలు ఉన్నట్టుగా 2016లో రెవెన్యూశాఖ జారీచేసిన జీవో నంబర్ 121ను మాత్రమే అందులో పొందుపరిచారు.
మరి… రంగారెడ్డి కలెక్టరేట్లోని ఈ-సెక్షన్ నుంచి ఈ రెండు లేఖలు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖకు వెళ్లాయి. ఇంతకీ… ఏది నిజం? ఒకే నంబర్‌పై వేర్వేరు వివరాలు (కంటెంట్)తో లేఖలు ఎలా వెళ్తాయి?. పైగా ఒక దానిలో 45 ఎకరాలు… ఇంకో దానిలో 17.04 ఎకరాలు. తొలుత 45 ఎకరాలపై రాసిన లేఖకు బదులుగా ఆ తర్వాత రాసిన దానిలో విస్తీర్ణాన్ని 17.04 ఎకరాలకు ఎందుకు కుదించారు? ప్లాట్లు ఉన్నందున నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ రాశారుగానీ అసలు సుప్రీం కోర్టు సూచన మేరకు ఆ భూమిపై ఖాస్రా పహాణీలో ఎవరి పేర్లు వచ్చాయి?. 11వ తేదీన రాసిన లేఖలోని మదన్మోహన్ ప్రసాద్, సురేంద్రమోహన్ ప్రసాద్, వసంత్మోహన్ ప్రసాద్, భీకం ప్రసాద్‌కు భూ బదలాయింపు ఎలా జరిగింది? మ్యుటేషన్ జరిగిందా? లింకు డాక్యుమెంట్లు ఉన్నాయా? ఇవేవీ అధికారులు వెల్లడించడంలేదు.