హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): మహిళలు, చిన్నారుల రక్షణ కోసం కేసీఆర్ హయాంలో ఏర్పాటైన సఖి కేంద్రాలు రాష్ట్రంలో మహిళలకు వరంగా మారాయి. పోలీసు శాఖతో కలిసి సఖి కేంద్రాలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.
ఇందు లో బాధితులకు ఉచిత కౌన్సెలింగ్ ఇవ్వడం తోపాటు వారంలో ఐదు రోజులపాటు వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. 2017లో మహిళల రక్షణ కోసం 33 కొత్త జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన వీటిలో ఇప్పటివరకు 65,460 కేసులు నమోదయ్యాయి.
మహిళల విషయంలో కేసీఆర్ ముందు స్తు ఆలోచన చేయడం వల్లే రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకొకటి చొ ప్పున సఖి కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. సఖి కేంద్రాల ఏర్పాటు ఘనత గత బీఆర్ఎస్ సర్కారుకే దక్కుతుందన్న అభిప్రాయాలు జోరుగా వినిపిస్తున్నాయి. సఖి కేంద్రాల్లో నమోదైన మొత్తం 65,460 కేసుల్లో గృహ హింస కింద 43,002 కేసులు, వరకట్నం వేధింపు కేసులు 3,049, పోక్సో కింద 2,278 ఇతర కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.