హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ మాసపత్రిక యోజనలో తెలంగాణ పల్లెల విజయగాథలను పొందుపర్చారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కృషితో పల్లెప్రగతి ద్వారా తెలంగాణ గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసప్రాంగణంలో అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా పంచాయతీరాజ్‌శాఖపై ముద్రించిన యోజన మాసపత్రికను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. గంగదేవిపల్లి, అంకాపూర్, ఇబ్రహీంపూర్ గ్రామాల గురించి యోజన పత్రికలో పేర్కొన్నారని, గ్రామాల్లోని పారిశుద్ధ్యం, ఇంటింటికీ నల్లా నీరు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాల ఏర్పాటుపై ప్రత్యేక వ్యాసాలు ప్రచురించారని వెల్లడించారు. తెలంగాణలో చేపడుతున్న పథకాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని ఎర్రబెల్లి కోరారు. కార్యక్రమంలో యోజన పత్రిక సీనియర్ ఎడిటర్ కృష్ణవందన, ఎడిటర్ సిరాజుద్దీన్ మహ్మద్, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ వై వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.