ముషీరాబాద్ మార్చి 18: 30 ఏండ్లుగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని సజీవంగా ఉంచింది ఎమ్మార్పీఎస్ ఉద్యమకారులేనని.. అందుకే ఈ విజయం వారికే దక్కుతుందని ఆ సంఘం అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం విద్యానగర్లోని ఆ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వంగపల్లి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదించడం హర్షించతగిన విషయమని తెలిపారు. 1994లో ఏర్పడిన ఎమ్మార్పీఎస్ ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా ఉద్యమాన్ని నడిపిందని పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతోమంది ప్రాణాలను అర్పించారని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇన్నాళ్లూ వర్గీకరణ చేయకుండా ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నాయని విమర్శించారు. వర్గీకరణ విజయం ఏ పార్టీకి దక్కదని.. అది కేవలం ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి దక్కుతుందని తేల్చిచెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ మాదిగల పట్ల చిత్తశుద్ధితో ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసి, ప్రధాని మోదీని కలిసి బిల్లు పెట్టమని కోరారని గుర్తుచేశారు. చివరకు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వల్లే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు అశోక్, ఎమ్మెస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరి వెంకట్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వరిగడ్డి చందు, రాధ, ఎల్ నాగరాజు, మారపాక నరేందర్, కానుగంటి సురేష్, వెంపటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.