సిద్దిపేట, ఏప్రిల్ 18: హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ దవాఖానల స్థాయిలో సిద్దిపేట వైద్య కళాశాల దవాఖానలో వైద్యం అందుతున్నది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు చొరవతో కార్పొరేట్ స్థాయిలో ఈ దవాఖానను అభివృద్ధి చేశారు. అన్ని సౌకర్యాలు కల్పించి సిబ్బంది, వైద్యులను నియమించారు. వీటన్నింటి ఫలితంగా సిద్దిపేట వైద్య కళాశాల దవాఖానలో అరుదైన ఆపరేషన్లకు శ్రీకారం చుట్టారు. సిద్దిపేట నియోజకవర్గంలో కీళ్లు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న పేద రోగలకు కార్పొరేట్ వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ఇటీవల సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్‌లో వైద్య శిబిరం నిర్వహించారు. అందులో మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న 56 మందిని గుర్తించారు.
వారికి సోమవారం సిద్దిపేట దవాఖానలో ఉస్మానియా దవాఖాన ఆర్థోపెడిక్ విభాగం అధిపతి డాక్టర్ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ మాధవి, సిద్దిపేట దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్ కుమార్‌తో కూడిన 10 మంది వైద్యుల బృందం తొలిసారిగా ముగ్గురికి ఆపరేషన్లను విజయవంతగా నిర్వహించిందని డీఎంఈ రమేశ్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిద్దిపేట దవాఖానలో ఇక నుంచి అన్ని రకాలైన వైద్య సేవలు, అత్యవసరమైన ఆపరేషన్లు, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన అత్యవసర చికిత్సలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు.