హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులను ప్రోత్సహించేందుకు నాబార్డ్ సహకారంతో అమలు చేస్తున్న మైక్రో ఇరిగేషన్ స్కీమ్ కొంతకాలంగా గాడితప్పింది. ప్రభుత్వం, అధికారులు ఈ పథకానికి సంబంధించి ప్రణాళికలు రూపొందించి, అమలులో నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. మూడేండ్లుగా ఈ పథ కం కింద అందాల్సిన సబ్సిడీలు పెండింగ్లో ఉన్నట్టు రైతులు వాపోతున్నారు. పాత బకాయిలు చెల్లించని ప్రభుత్వం..కొత్తగా మరో 40లక్షల యూనిట్లను మంజూరు చేస్తామని చెప్పడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నాబార్డ్, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలయ్యే ఈ పథకం కొంతకాలంగా నిలిచిపోయింది. అప్పులు తెచ్చి కూరగాయలు, పండ్ల తోటల్లో డ్రిప్, స్పింక్లర్లు ఏర్పా టు చేసుకున్న చిన్న, సన్నకారు రైతులకు వడ్డీలు పెరిగిపోయి.. సాగును వదిలివేసే పరిస్థితులు దాపురించాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి మైక్రో ఇరిగేషన్ రైతులకు రావాల్సిన బిల్లులు నిలిచిపోయాయి. దీంతో ఈ పథకం కింద డ్రిప్, స్పింక్లర్లు ఏర్పాటు చేసుకున్న రైతులు పెండింగ్ బిల్లుల కోసం ఉద్యానశాఖ అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు.
ఈ పథకం కింద ఎకరం డ్రిప్ ఏర్పాటుకు రూ.60 వేలు, స్పింక్లర్లకు రూ. 45 -రూ.55 వేలు సబ్సిడీ కింద రైతులకు అందాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 20వేల ఎకరాలకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నట్టు సమాచారం. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో ప్రతి జిల్లా నుంచి వేలాది మంది రైతులు డ్రిప్, స్పింక్లర్లను ఏర్పాటు చేసుకున్నారు. వీటి సబ్సిడీ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు పైసా రాలేదని, ఎంతమందికి మంజూరైన విషయాలను కూడా చెప్పడం లేదని రైతులు వాపోతున్నారు. 2025-26 సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా 45వేల వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. పాత బిల్లులు రాకపోవడంతో కొత్త యూనిట్ల మంజూరు ఇవ్వడానికి ప్రభుత్వం వెనుకాముందు ఆలోచిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా డ్రిప్, మైక్రో ఇరిగేషన్ పథకాన్ని 11 కంపెనీల ద్వారా అమలు చేస్తున్నారు. మెటోఫేం, జైన్,యునేలెర్స్, ఈపీసీ, సుధాకర్, క్యాపిటల్, గ్లోబల్, నాగార్జునవంటి సంస్థలు రైతులకు స్పింక్లర్లు, డ్రిప్ పైపులను సరఫరా చేస్తున్నాయి. వీరికి 2021-22 సంవత్సరం నుంచి బిల్లులు పెండింగ్లో ఉండటంతో కొత్త యూనిట్లను గ్రౌండ్ చేయడానికి వెనుకడుగు వేస్తున్నట్టు సమాచారం.
వచ్చే ఐదేండ్లలో 40 లక్షల కొత్త యూనిట్లను మంజూరు చేస్తామని ఉద్యానశాఖ ఇటీవల ప్రకటించింది. నాబార్డ్ సహకారంతో కూరగాయలు, పండ్లు, పామాయిల్, సుగంధ ద్రవ్యాల సాగును ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున డ్రిప్, స్పింక్లర్ల యూనిట్లను మంజూరు చేస్తామని పేర్కొంది. మూడేండ్లుగా ఏర్పాటు చేసుకున్న రైతులకు అందాల్సిన డ్రిప్, స్పింక్లర్ల సబ్సిడీలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని చెల్లించకుండా..కొత్త వాటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2021-22 నుంచి రావాల్సిన సబ్సిడీలు అందించి, కొత్తగా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులకు మంజూరు ఇవ్వాలని ఉద్యాన పంటలు సాగుచేస్తున్న రైతులు కోరుతున్నారు.
