హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా దామగుండంలో రాడార్ ప్రాజెక్టు రెండో దశ పనులకు సంబంధించిన అనుమతులపై నివేదిక సమర్పించాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ రాడార్ కేంద్రానికి 2,900 ఎకరాల అటవీ భూములను కేటాయించడాన్ని సవాలు చేస్తూ 2020లో దామగుండం ఫారెస్ట్ ప్రొటెక్షన్ జేఏసీ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ వాదన వినిపిస్తూ.. ఈ పిల్‌పై తూర్పు నౌకాదళ విభాగం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిందని తెలిపారు. అటవీ, పర్యావరణ శాఖ తరఫున కౌంటర్ దాఖలు చేసేందుకు మరికొంత గడువు కావాలని కోరారు. దీంతో కౌంటర్‌తోపాటు అనుమతులపై నివేదిక సమర్పించేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చిన ధర్మాసనం.. ఆ తదుపరి విచారణను ఫిబ్రవరి 18వ తేదీకి వాయిదా వేసింది.