హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని గురుకులాలు, వసతి గృహాల్లో సౌకర్యాల కల్పనకు తీసుకున్న చర్యలపై సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. గతంలో ఆదేశించిన మేరకు మౌలిక వసతుల కల్పన అమలు నివేదికను సమర్పించాలని కోరింది. గత ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే కల్పించిన సౌకర్యాలు, ఇంకా ఏ మేరకు సౌకర్యాలను కల్పించాల్సి ఉన్నదో నివేదిక ఇవ్వాలని తెలిపింది. తదుపరి విచారణను జనవరి 22కు వాయిదా వేసింది.
హైదరాబాద్, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ) : కనీస వేతన సలహామండలిలో 12మంది సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. మండలి చైర్మన్‌గా బీ జనక్ ప్రసాద్‌ను ఇదివరకే నియమించగా, తాజాగా సభ్యులను ప్రకటించింది. కార్మిక సంఘాల నుంచి ఐఎన్టీయూసీ నేతలు ఎర్రం పిచ్చిరెడ్డి, ఎస్. నర్సింహారెడ్డి, ఏఐటీయూసీ నుంచి ఎండీ యూసుఫ్, తెలంగాణ స్టేట్ ప్రైవేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్‌కు చెందిన ఎన్. రాజుముదిరాజ్, హైదరాబాద్ హోటల్ వర్కర్స్ యూనియన్‌కు చెందిన కొత్తపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులను నియమించగా, యాజమాన్యాల తరఫున ఎఫ్టీఐఐసీకి చెందిన మీలా జయదేవ్, కశ్యప్‌రెడ్డి, మహిమా దాట్ల, డిక్కీకి చెందిన నర్రా రవికుమార్, బీడీ తయారీదారుల తరఫున బాసాని చంద్రప్రకాశ్, స్వతంత్ర సభ్యులుగా సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్‌కు చెందిన ప్రొఫెసర్ సీ. రవి, నల్సార్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ ఎన్. వాసంతిని నియమించారు. కనీస వేతన కమిటీ కార్యదర్శి ఈ మండలికి ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా వ్యవహరిస్తారని, సభ్యుల పదవీకాలం రెండేళ్లు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.