హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో విద్యుత్తు కేబుళ్లను అండర్‌గ్రౌండ్‌లోకి మార్చాలన్న తలంపులో ఉన్న సర్కా రు సమగ్రంగా అధ్యయనం చేస్తున్నది. ఇదే అంశంపై అధ్యయనం చేసేందుకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం బెంగళూరు లో పర్యటించింది. ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఈ పర్యటనలో ఉన్నారు.
అండర్ గ్రౌండ్ కేబుల్ ప్రాజెక్ట్‌పై అక్కడి అధికారులతో చర్చించారు. బెంగళూరులో 2018లో అండర్‌గ్రౌండ్ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. ఇప్పటి వరకు 7,400 కిలోమీటర్ల 11కేవీ ఓవర్‌హెడ్ లైన్, వేలాది కిలోమీటర్లలో టెన్షన్ లైన్లను అండర్‌గ్రౌండ్‌లోకి మార్చినట్టు అధికారులు తెలిపారు. కేబులింగ్ డక్డ్ను ఏర్పాటు చేసి, టెలికాం సంస్థలతో లీజు ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు వివరించారు. పలు అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కర్ణాటక విద్యుత్తుశాఖ అధికారులను ఆరా తీశారు. ఫ్యూచర్ సిటీతోపాటు జనసాంధ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్ ఉపయోగకరమని వ్యాఖ్యానించారు.