హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. మాదిరి ప్రశ్నపత్రాల ఆధారంగా ప్రశ్నలు, సమాధానాలతో కూడిన మెటీరియల్‌ను రూపొందిస్తున్నారు. వీలైనంత తొందరంగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లా ఉమ్మడి పరీక్షల మండలి (డీసీఈబీ) అధికారులతో చర్చించి స్టడీ మెటీరియల్‌ను రూపొందించాలని ఆదేశించారు.
నిరుడు కూడా స్టడీ మెటీరియల్‌ను విద్యార్థులకు అందజేశారు. అయితే, కరోనా ప్రభావంతో 70 శాతం సిలబస్‌తో మెటీరియల్‌ను తెచ్చి, 11 పేపర్లకు పరీక్షలు నిర్వహించారు. ఈ విద్యాసంవత్సరం 100 శాతం సిలబస్‌తో 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకే వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాంతో కొత్తగా స్టడీ మెటీరియల్‌ను తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు నిర్వహించే ఎస్సెస్సీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఎస్సీఈఆర్టీ అధికారులు 40 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ నెల 3 నుంచి మార్చి 30 వరకు సెలవులను మినహాయించి ప్రత్యేక తరగతులు కొనసాగిస్తారు.
రెండు ప్రీ ఫైనల్స్
ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులకు రెండు ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. గతంలో ఒక ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉండగా, ఈసారి ఫిబ్రవరిలో ప్రీ ఫైనల్ -1, మార్చిలో ప్రీ ఫైనల్ -2 నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.