నాగర్‌కర్నూల్ రూరల్, ఆగస్టు 19: వారం రోజులుగా నాగర్‌కర్నూల్ జిల్లాలో వర్షం దంచికొడుతున్నది. దీంతో జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువుకు భారీగా వరద వస్తున్నది. ఉయ్యాలవాడ-చర్ల తిర్మలాపూర్ గ్రామాల మధ్య కేసరి సముద్రానికి నీటిని అందించే నల్లవాగు పొంగి పొర్లుతుండటంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.
ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పుట్టి సాయం తో వాగును దాటుతున్నారు. తిర్మలాపూర్‌లో హైస్కూల్ లేకపోవడంతో విద్యార్థులు ప్రమాదకరంగా పుట్టి మీద ప్రయాణం సాగిస్తూ నాగర్‌కర్నూల్‌లోని పాఠశాలకు వెళ్తున్నారు. పిల్లలను పాఠశాలలకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ‘మేం బడికి పోతం.. బ్రిడ్జి కట్టండి సారూ!’ విద్యార్థులు అధికారులను వేడుకుంటున్నారు.