పురుగులు పట్టిన అన్నం..నీళ్ల చారు తాము తినలేమంటూ రంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు. 240 మంది విద్యార్థులు ఉంటే, మూడు కిలోల కంది పప్పు వండిపెడుతూ పూర్తిగా నీళ్ల చారుతో భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
విద్యార్థులను కొరికిన ఎలుకలు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ గురుకులంలో విద్యార్థులను ఎలుకలు కొరికాయి. బోర్నపల్లి శివారులోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల (సైదాపుర్)లో 8వతరగతి విద్యార్థులు యశ్వంత్, సాయిచరణ్, కౌశిక్, అక్షిత్, సృజన్, 9వ తరగతి విద్యార్థి రక్షిత్ రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు కొరికాయి.
పీసీసీ చీఫ్ ఇల్లును ముట్టడించిన విద్యార్థులు
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ ఇంటిని శుక్రవారం ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
రేషన్ కార్డుల కోసం ధర్నా
అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం ఎదుట జూనోని గ్రామస్థులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ వచ్చి హామీ ఇచ్చే వరకు ఇకడి నుంచి కదిలేది లేదని భీష్మించారు.