HCU | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూ పర్యావరణాన్ని నాశనం చేయడానికి కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. పక్షలు, జంతువులు, క్షీరదాలు, సరీసృపాలు, అరుదైన కొండల ఉనికిపై జేసీబీ దాడిని పర్యావరణ ప్రేమికులు, విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
అందులో భాగంగా సోషల్ మీడియాలో చేంజ్ డాట్ ఆర్గ్ వెబ్సైట్లో హెచ్‌సీయూను కాపాడుకుందామంటూ సంతకాల సేకరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 1.50 లక్షల సంతకాలను లక్ష్యంగా నిర్దేశించుకుంటే ఇప్పటికే 1,33,029 మంది సంతకాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ స్వార్థపూరిత ఆలోచనలకు పర్యావరణాన్ని బలిచేయొద్దంటూ సంతకాలతో నిరసన తెలిపారు.
అనేక దేశాల్లో భూకంపాలు, వరదలతో ప్రజలు మరణిస్తున్న ప్రస్తుత తరుణంలో పర్యావరణాన్ని రక్షించకుండా అడవులను నాశనం చేసి, భూములు విక్రయించాలని చూడటం సహేతుకం కాదని పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సేవ్ హెచ్‌సీయూ బయోడైవర్సిటీ అంటూ సోషల్ మీడియాలో నినదించారు. సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాన్ని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు.