Food Infection | హైదరాబాద్ సిటీబ్యూరో/తాండూరు, డిసెంబర్ 12:(నమస్తే తెలంగాణ) : ‘మేము ఎంతో దూరం నుంచి పిల్లలను ఇక్కడికి పంపిస్తే ఇంత దారుణంగా చూస్తారా.. వాళ్లకు తిండికూడా సరిగ్గా పెట్టరా? మా పిల్లలను మాకు చూపెట్టకుండా ఉంచే అధికారం మీకెక్కడిది? హాస్పిటల్‌కు తీసుకెళ్లకుండా హాస్టల్లో ఎందుకు చికిత్స చేస్తున్నరు? నిజమేందో చెప్పండి.. అసలు మా పిల్లలకు బాగైతుందా? లేదా?’ అంటూ తాండూరు గిరిజన బాలికల ఆశ్రమపాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థినుల తల్లిదండ్రులు రంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్‌జైన్‌ను గురువారం నిలదీశారు. పాఠశాలలో కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన 9 మంది విద్యార్థినులను హాస్టల్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు.
పర్యవేక్షణకు కలెక్టర్ ప్రతీక్ జైన్ రాగా ఆయనను విద్యార్థుల తల్లిదండ్రులు, బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. తమ పిల్లలను ఇప్పటివరకు దవాఖానకు తీసుకెళ్లకుండా ఇక్కడే ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. కలెక్టర్ మాట్లాడుతూ దవాఖానలో అయితే పిల్ల లు మానసికంగా ఇబ్బంది పడతారని, అందుకే ఇక్కడే ప్రభుత్వ వైద్యులతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని బదులిచ్చా రు. పిల్లలందరి ఆరోగ్యం కుదుటపడింద ని, ఒక్క అమ్మాయికి మాత్రం కొంత అస్వస్థతగా ఉన్నదని, ఆమె కూడా త్వరలోనే కోలుకుంటుందని చెప్పారు. తల్లిదండ్రులను చూసి పిల్లలు ఏడుస్తున్నారని, వారిని సముదాయించేందుకు అప్పుడప్పుడు మాత్రమే పేరెంట్స్‌ను లోపలికి పంపి మళ్లీ బయటనే ఉంచుతున్నామని తెలిపారు. ఘటనకు కారణమైన హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేశామని, వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తామని తెలిపారు.