హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించేందుకు చేపట్టిన లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (లిప్)కు ‘ఉన్నతి’ అనే పేరును అధికారులు ఖరారు చేశారు. ఈ పేరుతోనే ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని 6 నుంచి 9 తరగతుల విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించేలా ‘ఉన్నతి’ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ ఉన్నతి కార్యక్రమాన్ని మూడు నుంచి నాలుగేండ్ల పాటు నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ నెలలోనే టీచర్లకు శిక్షణ ఇచ్చి ఆగస్టు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులు కనీన సామర్థ్యాల సాధనకు నిరుడు నుంచి నిర్వహిస్తున్న ‘తొలిమెట్టు’పై రాష్ట్రస్థాయిలో ఈ నెల 13,14,15న టీచర్లకు శిక్షణ ఇస్తారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని టీఎస్ అపార్డ్లో ఈ శిక్షణను నిర్వహిస్తారు.