KGBV Students | హైదరాబాద్ (శంషాబాద్ రూరల్), ఆగస్టు 30: ఎస్సీ, ఎస్టీల దగ్గర ఇలాగే వాసనొస్తదని ఉపాధ్యాయులు అన్నట్టు విద్యార్థులు చెప్పారు. తమ కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలోని కస్తూర్బాగాంధీ హాస్టల్ విద్యార్థులు శుక్రవారం నడిరోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ‘పురుగుల అన్నం పెడుతున్నరు. ఇదేమిటని ప్రశ్నిస్తే కొడుతున్నరు. మంచి నీళ్లు కావాలని అడిగితే మీకు ఇవే ఎక్కువ అంటున్నరు. ఉపాధ్యాయులు మాత్రం మంచి కూరలు వండుకొని తింటున్నరు. మేము అడిగితే ఇంటి నుంచి తెచ్చుకోమంటున్నరు. దుస్తులు ఒక జత మాత్రమే ఇచ్చారు. ఇంకో జత అడిగితే ఇదే ఎక్కువ అంటున్నరు. ఇచ్చిన జతనే రోజు ఉతుక్కోవాలని లేకుంటే వాసనొస్తుందని అంటున్నరు.
అయినా ఎస్సీ, ఎస్టీల దగ్గర ఇట్లనే వాసనొస్తదని కించపర్చుతున్నరు’ అని పేర్కొన్నారు. హాస్టల్లో దాదాపు 370 మంది విద్యార్థులు ఉన్నారని, వంట కోసం వచ్చే సరుకులను ఉపాధ్యాయులు పంచుకుటున్నారని విద్యార్థులు ఆరోపించారు. తమ సమస్యలను ప్రభుత్వం ఇప్పటికైనా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళన గురించి తెలుసుకున్న శంషాబాద్ రూరల్ సీఐ అక్కడికి చేరుకున్నారు.
అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. సమస్యలపై స్పందించిన రంగారెడ్డి డీఈవో సుశీధర్రావు మాట్లాడుతూ విద్యార్థులకు న్యాయం చేస్తానని, సమస్యలన్నీ పరిష్కరిస్తానని పేర్కొన్నారు. కాగా, శుక్రవారం హాస్టల్కు ఓ ఆటో వచ్చినప్పుడు గేటు తెరువడంతో విద్యార్థులు బయటికి వచ్చి రోడ్డుపై ఆందోళన చేయడం వారి దీనస్థితిని తెలియజేస్తున్నది. ఒకవేళ గేటు తెరువకపోతే వారి సమస్యలు ఇంకా బయటికి వచ్చేవి కావు.