Gurukula Schools | కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ వాంకిడి, నవంబర్ 6: గిరిజన విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే ఐటీడీఏ ఆశ్రమ పాఠశాల అదుపు తప్పుతున్నది. పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారడంతో ఆశ్రమాల్లో విద్యార్థులకు అందుతున్న ఆహారం, చదువులతోపాటు వారి సంక్షేమంపై నీలినీడలు అలుముకుంటున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో 3 రోజుల వ్యవధిలో 76 మంది విద్యార్థినులు ఫుడ్‌పాయిజన్‌కు గురయ్యారు.
మొదట 32 మంది అస్వస్థతకు గురైనప్పుడే అధికారులు సరిగా స్పం దించి ఉంటే, మరో 44 మంది ఫుడ్‌పాయిజన్‌తో దవాఖాన పాలయ్యేవారు కా దు. 590 మంది ఉండే ఈ ఆశ్రమ పా ఠశాలలో ఇప్పుడు 110 మంది మాత్రమే ఉన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనతో విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతుండటంతో తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను ఇండ్లకు తీసుకెళ్తున్నారు. పాఠశాల యాజమాన్యం వారి నుంచి లెటర్లు తీసుకుంటూ పంపించడం గమనార్హం.
వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌కు గల కారణాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు. మొదట కలుషిత నీరు కారణమని భావించి నీటి పరీక్ష చేయించారు. నీరు కలుషితం కాలేదని రిపోర్టులు వచ్చా యి. సాయంత్రం విద్యార్థుల కోసం వం డిన భోజనాన్ని పరీక్షలకు పంపించారు. దాని రిపోర్టులు ఇంకా రాలేదు. ఫుడ్‌పాయిజన్ జరిగిన రోజు మధ్యాహ్నం సొరకాయ సాంబారు అన్నం, సాయంత్రం ట మాట చారుతో భోజనాలు వడ్డించారు. భోజనాలు చేసిన కొద్దిసేపటికే 32 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మరో రెండు రోజుల్లో 44 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు.
మొత్తం 76 మంది విద్యార్థులు ఫుడ్‌పాయిజన్‌కు గురయ్యారు. వీరిలో 46 మంది కోలుకోగా ఇంకా 20 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆసిఫాబాద్‌లోని ఒక ప్రైవేట్ దవాఖానలో ఆరుగురు, మం చిర్యాలలో ముగ్గురు, హైదరాబాద్‌లో ము గ్గురు, మిగతావారు వాంకిడి పీహెచ్సీలో చికిత్స తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఒక విద్యార్థినికి వెంటిలేషన్‌పై చికిత్స అందిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేక ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలు అదుపు తప్పుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఉన్న 46 ఆశ్రమ పాఠశాలల్లో దాదాపు 12 వేల మంది గిరిజన విద్యార్థులు చదువుకొంటున్నారు.
ఫుడ్‌పాయిజన్ అయినరోజు సాయంత్రం మా హాస్టల్ల్లో వండిన టమాట కూరతో పెట్టిన అన్నం తిన్నాను. భోజనం చేసిన కొద్దిసేపటికే పడిపోయాను. నాలాగే చాలామంది అనారోగ్యానికి గురైయ్యారు. అందరినీ దవాఖానకు తీసుకొచ్చారు. ఇప్పుడు బాగున్నాను. మా హాస్టళ్లో ప్రతి రోజులాగే ఆ రోజు కూడా భోజనాలు పెట్టారు. మాకు ఎందుకు ఇలా అయ్యిందో తెలియదు.
– వైష్ణవి, 9వ తరగతి, వాంకిడి ఆశ్రమ పాఠశాల (వాంకిడీ పీహెచ్సీలో చికిత్స పొందుతున్న బాలిక)
మేము ఇంటి నుంచి ఏమీ తెచ్చుకొని తినలేదు. రోజూ హాస్టల్లో పెట్టే భోజనం మాత్రమే తిన్నాను. అన్నం తిన్న కొద్దిసేపటికే పడిపోయాను. వాంతులు కూడా అయ్యాయి. తర్వాత మమ్మల్ని దవాఖానకు తీసుకొచ్చారు. మా హాస్టల్లో చాలామందికి ఇలాగే జరిగింది. ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉన్నది. హాస్టల్లో తాగేనీళ్లు సరిగా లేకపోవడంతోనే మాకు వాంతులు, విరేచనాలు అయ్యాయని అనుకుంటున్నారు.
– కాత్లె వేదిక 9వ తరగతి, వాంకిడి ఆశ్రమ పాఠశాల (వాంకిడీ పీహెచ్సీలో చికిత్స పొందుతున్న బాలిక)
ఆశ్రమ పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌కు గల కారణాలు తెలుసుకుంటున్నాం. విద్యార్థులు తాగేనీళ్లలో ఎలాంటి కలుషితాలు లేవని నీటిని పరీక్షించిన అధికారులు రిపోర్టు ఇచ్చారు. ఆ రోజు విద్యార్థుల కోసం వండిన అన్నాన్ని పరీక్షల కోసం పంపించాం. ఆ రిపోర్టు వస్తే కారణాలు తెలుస్తాయని భావిస్తున్నాం. ఆశ్రమంలో రెగ్యులర్‌గా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాం.
– శ్రీనివాస్, ఆశ్రమ పాఠశాల హెచ్ఎం