ముషీరాబాద్, జూలై 6 : ఓపెన్ స్కూల్ పేరిట సన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ నిర్వహిస్తున్న పరీక్షలో విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతుండగా యువజన, విద్యార్థి సంఘాలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. ఈ ఘటన ముషీరాబాద్ పరిధిలోని రాంనగర్లో చోటుచేసుకున్నది. ఘటనకు సంబంధించి విద్యార్థి సంఘాలు, పోలీసులు తెలిపిన వివరాలు.. రాంనగర్‌లోని సన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ కర్ణాటక ఓపెన్ స్కూల్ అనుమతి తీసుకుని ఆదివారం పరీక్ష నిర్వహిస్తున్నది. పరీక్షలో పాస్ అయ్యేందుకు ఒక్కో విద్యార్థి నుంచి రూ.30 వేలు తీసుకొని పుస్తకాలు, ఆన్సర్‌షీట్స్ నేరుగా పరీక్ష కేంద్రంలోకి పంపించి విద్యార్థులతో పరీక్ష రాయిస్తున్నది.
దాదాపు 50 మంది విద్యార్థులు పేరు లేని ఓ భవనంలో పరీక్ష రాయిస్తున్న విషయం తెలిసి గిరిజన, బీసీ, ఏబీవీపీ సంఘాల నాయకులు అక్కడికి వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో కాలేజీ యాజమాన్యం, విద్యార్థి సంఘాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా విషయం పోలీసులకు తెలిసింది. పోలీసులు రంగప్రవేశం చేసి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఆన్సర్‌షీట్లు, ప్రశ్నపత్రాలు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఓ అధికారి వచ్చి సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తానని చెప్పారు. విచారణ జరిపి కళాశాలకు అనుమతి ఉన్నది లేనిది తేల్చడంతోపాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఎలాంటి అనుమతి లేకుండా ఓపెన్ స్కూల్ పేరిట కళాశాల నిర్వహిస్తున్నట్టు గిరిజన యువమోర్చా, బీసీ యువమోర్చా నాయకులు లింగంగౌడ్, శ్రీనాథ్, సురేశ్‌గౌడ్ ఆరోపించారు.