హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోని (కేజీబీవీ) బాలికల వైద్యంపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా టెలిమెడిసిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థినులు ‘హలో డాక్టర్’ అంటూ వైద్య సేవలు పొందవచ్చు. రాష్ట్రంలో 495 కేజీబీవీలున్నాయి. వీటిల్లో 1.30లక్షల మంది అమ్మాయిలు చదువుకుంటున్నారు. కేజీబీవీల కోసం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో ప్రత్యేకంగా ‘హెల్త్ కమాండ్ కంట్రోల్ సెంటర్’ ఏర్పాటు చేస్తారు. ఈ సెంటర్లో డాక్టర్, ఇద్దరు ఏఎన్ఎంలు, సిబ్బంది ఉంటారు. టోల్‌ఫ్రీ నంబర్‌కు సైతం ఫోన్‌చేసి డాక్టర్‌తో మాట్లాడొచ్చు.. ఆరోగ్య సమస్యలను చెప్పుకోవచ్చు. డాక్టర్.. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసి, అవసరమైన వైద్యాన్ని సూచిస్తారు. విద్యార్థిన్థుల హెల్త్ ప్రొఫైల్ రూపొందించనున్నారు.