వ్యవసాయ యూనివర్సిటీ, జనవరి 11 : కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ తీరు వివాదస్పదంగా మారుతున్నది. తెలంగాణకు చెందిన విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థుల ప్రయోజనాలు దెబ్బతీసేలా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రా ప్రాంతానికి చెందినవారికి లబ్ధి చేకూరేలా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం అనుమతి లేకుండానే నలుగురు టీచింగ్ ఫ్యాకల్టీ, ముగ్గురు నాన్ టీచింగ్ స్టాఫ్‌ను రెగ్యులరైజ్ చేయడమే ఆయన తీరుకు నిదర్శనంగా నిలుస్తున్నది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి 2025 డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 31 వరకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ విషయాన్ని మరువకముందే తెలంగాణకు చెందిన విద్యార్థులకు అన్యాయం జరిగేలా అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామక నోటిఫికేషన్ విడుదల చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇక్కడి విద్యార్థులు ఏఎస్ఆర్బీ, ఏఆర్ఎస్, ఎస్ఎమ్ఎస్, ఎస్టీవో వంటి జాతీయ స్థాయి మెయిన్స్ పరీక్షలు రాస్తున్న సమయంలో నోటిఫికేషన్ విడుదల చేసి వాళ్లకు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు రాకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నట్టు మండిపడుతున్నారు. కొన్నేండ్లుగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ యువత పోటీ పరీక్షలు రాస్తున్న సమయంలోనే నోటిఫికేషన్ ఇచ్చి.. నియామక ప్రక్రియలో పాల్గొనకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ కీలక దశలో ముందస్తు సమాచారం లేకుండా నోటిఫికేషన్ విడుదల చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. రిజిస్ట్రార్ తీరుతో పూర్తిగా పక్క రాష్ట్ర అభ్యర్థులు ఎక్కువ లబ్ధిపొందే అవకాశం ఉందని మండిపడుతున్నారు. పీజీ ఫైనల్ ఇయర్, పీహెచ్డీ, త్వరలో పీహెచ్డీ పూర్తి చేసే అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ అందని ద్రాక్షగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.