మారేడ్‌పల్లి, జూలై 9: తల్లిదండ్రులు కాలేజీ ఫీజు కట్టాలని కొడుకుకు డబ్బులిస్తే.. ఆ డబ్బులను బెట్టింగ్ ఆడి పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. నల్లగొండలోని రవీంద్రనగర్‌కు చెందిన కోడూరు నితిన్(21) ఘట్కేసర్ సమీపంలోని యమనంపేటలో ఉంటూ అక్కడే శ్రీనిధి కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
కళాశాల ఫీజు కట్టాలని తల్లిదండ్రులు నితిన్‌కు రూ. లక్షా 20 వేలు ఇచ్చారు. ఈ డబ్బును బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకున్నాడు. ఫీజు డబ్బుల కోసం కళాశాల యాజమాన్యం నితిన్ తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పది రోజుల కిందట నితిన్‌ను మందలించారు. మనస్తాపానికి గురైన అతడు మంగళవారం ఘట్కేసర్ -చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.