హైదరాబాద్ సిటీబ్యూరో ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై కాంగ్రెస్ సర్కారు, యూనివర్సిటీ రిజిస్ట్రార్ అనుసరిస్తున్న తీరుపై విద్యార్థులు ఆగ్రహంతో మంగళవారం క్యాంపస్‌లోని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌ను ముట్టడించారు. 400 ఎకరాల పరిసరాల్లోనే పోలీసుల బందోబస్తు కొనసాగిస్తున్నామని చెప్పి, క్యాంపస్ అంతటా ఎందుకు మోహరించారని నిలదీశారు. హెచ్‌సీయూపై ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్టుగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. క్యాంపస్ నుంచి పోలీసు బలగాలను ఉపసంహరిస్తున్నామన్న భట్టివిక్రమార్క ప్రకటన ఉత్తమాటే అయిందని ధ్వజమెత్తారు. విద్యార్థులు వస్తున్నారని తెలిసి రిజిస్ట్రార్ క్యాంపస్ నుంచి బయటకు వెళ్లిపోయారని విద్యార్థులు తెలిపారు. రిజిస్ట్రార్ విద్యార్థుల తరఫున కాకుండా ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. వీసీతో భేటీకి ఎగ్జామినేషన్ కంట్రోలర్ కూడా అనుమతించలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. క్యాంపస్ నుంచి పోలీసులను ఉపసంహరించేలా ప్రభుత్వానికి లేఖ రాయాలని రిజిస్ట్రార్‌ను డిమాండ్ చేశారు.