వనపర్తి, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ)/మదనాపురం: రాష్ట్రంలో గురుకులాల్లో విద్యార్థుల వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే 48 మంది విద్యార్థులు వివిధ కారణాలతో అసువులు బాసారు. బుధవారం వనపర్తి జిల్లా మదనాపురం ఎస్సీ బాలుర గురుకులంలో మరో విద్యార్థి పట్టపగలు ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణాలు తీసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. మదనాపురం మండలం కొన్నూరుకు చెందిన శ్రీనివాసులు, సత్యమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. రెండో కొడుకైన ప్రవీణ్ (13) మంగళవారం సాయంత్రం కబడ్డీ ఆడినప్పుడు ప్రవీణ్‌కు గాయాలయ్యాయి. గాయాలైన ప్రవీణ్‌కు గురుకులంలో ఉండే హెల్త్ టేకర్ టాబ్లెట్లు ఇచ్చారు. గాయపడిన విషయాన్ని టీచర్ ఫోన్లో ప్రవీణ్ తల్లిదండ్రులతో మాట్లాడినట్టు చెబుతున్నారు. బుధవారం టిఫిన్ చేసిన అనంతరం ప్రార్థనకు వెళ్లాడు. ఆ సమయంలో తనకు బాగా తలనొప్పి వస్తున్నదని టీచర్‌కు చెబితే టాబ్లెట్ వేసుకొని విశ్రాంతి తీసుకొమ్మన్నారు. డార్మిటరీలోకి వెళ్లిన ప్రవీణ్ అక్కడి ఫ్యాన్‌కు బ్లాంకెట్‌తో ఉరేసుకున్నాడు. ప్రవీణ్ బాబాయి గురుకులానికి చేరుకొని టీచర్లతో ఆరా తీశారు. గదికి వెళ్లి చూడగా ప్రవీణ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. మదనాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి వనపర్తికి జిల్లా దవాఖానకు తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు.