షాద్నగర్, డిసెంబర్ 9: గిరిజన వసతి గృహంపైనుంచి ప్రమాదవశాత్తు జారిపడగా ఓ విద్యార్థినికి తీవ్రగాయాలైన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని హాజిపల్లిరోడ్డులోగల గిరిజన వసతిగృహంలో ఉంటున్న పూజ ప్రభుత్వ బాలికల కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నది. శుక్రవారం రాత్రి ప్రమాదశాత్తు వసతిగృహం రెండో అంతస్థు నుంచి కిందపడగా తీవ్రగాయాలయ్యాయి.
నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో తోటి విద్యార్థినులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే చేరుకుని విద్యార్థినిని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. రెండు కాళ్లతోపాటు వెన్నెముకకు తీవ్రగాయాలయ్యాయని, చికిత్సకు రూ. 8లక్షల వరకు ఖర్చువుతాయని వైద్యులు తెలుపడంతో నిరుపేదలైన తల్లిదండ్రులు విద్యార్థినిని ఉస్మానియా దవాఖానలో చేర్పించారు.
వసతిగృహం నిర్వాహకుల నిర్లక్ష్యంతో తమ కూతురికి ఈదుస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. చికిత్సకు నిర్వాహకులు ముందుకు రావడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు.