నిర్మల్, మే 13 (నమస్తే తెలంగాణ): బాసరలో ఆంధ్రా సాములోరి లీలలు, ఆశ్రమ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు ఎట్టకేలకు అధికారయంత్రాంగం కదిలింది. మే 5న ‘బాసరలో నెత్తిటి ఘోష’, 6న ‘మణికంఠది హత్యా.. ఆత్మహత్యా?’, 7న ‘ఆంధ్రా సాములోరా? బాసర అమ్మవారా?’, 8న ‘వేదం పేరిట విధ్వంసం’, 9న ‘ప్రభుత్వానికి పట్టదా?’ అంటూ నిర్మల్ జిల్లా బాసరలోని ప్రైవేట్ ఆశ్రమంలో కొనసాగుతున్న అరాచకాలు, సర్కారు నిర్లక్ష్యంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన వరుస కథనాలు అధికారయంత్రాంగాన్ని కదిలించాయి.
సరస్వతీ దేవి పుణ్యక్షేత్రంలో వివాదాస్పద వ్యవహారాలకు కారణమవడమే కాకుండా, వేద భారతి ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి మృతిచెందడం, మరో విద్యార్థి తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటం వంటి వ్యవహారాలపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు. భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి నేతృత్వంలో హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు.
కమిటీలో భైంసా ఆర్డీవోతోపాటు పోలీసు శాఖ నుంచి సీఐ స్థాయి అధికారి, విద్యాశాఖ నుంచి జీఈసీవో(జెండర్ అండ్ ఈక్విటీ కో-ఆర్డినేటర్) కరుణ, సమగ్ర శిక్ష అసిస్టెంట్ స్టాటిస్టికల్ కో-ఆర్డినేటర్ లింబాద్రి, కార్మిక శాఖ నుంచి నిర్మల్ అసిస్టెంట్ కమిషనర్ రాజలింగు, ఐసీడీఎస్ నుంచి ఏసీడీపీవో నాగలక్ష్మి, డీసీపీవో మురళి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ వేద భారతి ఆశ్రమంపై వచ్చిన ఫిర్యాదులు, విమర్శలపైనే కాకుండా అక్కడ జరుగుతున్న అన్ని వ్యవహారాలపైనా క్షేత్రస్థాయిలో విచారణ చేయనున్నది.
ఆశ్రమంలోనే కాకుండా స్థానికులను కూడా విచారించనున్నది. వేద పాఠశాల ముసుగులో ఆశ్రమ నిర్వాహకులు వేదం నేర్చుకునేందుకు వచ్చిన విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయిస్తుండటం, పుష్కర ఘాట్‌ను ఆక్రమించి గోదావరి హారతి, బీజాక్షరాల పేరిట భక్తుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారంటూ వస్తున్న ఆరోపణలపైనా విచారణ చేయనున్నది. వేద పాఠశాల విద్యార్థి లోహిత్‌పై దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లడం, మరో విద్యార్థి మణికంఠ అనుమానాస్పద స్థితిలో కరెంటు షాక్‌తో మరణించడం వంటి అంశాలపై విచారణ చేపట్టనున్నది. అనంతరం కమిటీ సభ్యులు నిర్మల్ కలెక్టర్‌కు నివేదిక అందజేయనున్నారు. దాని ఆధారంగా ఆశ్రమంపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది.
బాసరలో వేద భారతి విద్యానందగిరి ఆశ్రమంలో జరుగుతున్న అవాంఛనీయ ఘటనలపై విచారణకు హై లెవెల్ కమిటీ వేసినం. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వచ్చిన కథనాలు, బాసర గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఆశ్రమ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని ఆదేశించాం. భైంసా ఆర్డీవో విచారణాధికారిగా వ్యవహరించే ఈ కమిటీలో మరో ఆరుగురు అధికారులు ఉంటారు. ఆశ్రమంలో చోటుచేసుకున్న వ్యవహారాలపై ఈ కమిటీ ఐదు రోజుల్లోగా పూర్తిస్థాయి విచారణ చేసి నివేదిక ఇస్తుంది. కమిటీ నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
-అభిలాష అభినవ్,కలెక్టర్, నిర్మల్